పదిహేను రోజుల్లోనే యుద్ధమట. కేసీయార్ సిద్ధంగా వుండాలట. తలెంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విసిరిన సవాల్ ఇది. కాంగ్రెస్ పార్టీని రాజగోపాల్ రెడ్డి వీడటం ఖాయం. ఇది ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. అయితే, ఆయన బీజేపీలో చేరతారా.? లేదా.? ఇదైతే కొంత గందరగోళం.
బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆహ్వానించేశారు కూడా. కానీ, బీజేపీలో తాను చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారికంగా ప్రకటించడంలేదు. పదిహేను రోజుల్లో పూర్తి స్పష్టతనిస్తారట. అప్పటినుంచి ఇక యుద్ధమేనన్నది రాజగోపాల్ రెడ్డి ఉవాచ.
యుద్ధం ఎవరితో చేస్తారు.? మూడున్నరేళ్ళుగా ఆయన చేసిన యుద్ధమేంటి.? అన్న చర్చ సహజంగానే ఆయన్ని గెలిపించిన మునుగోడు ప్రజల్లో జరగకుండా వుంటుందా.? ఈ సమయంలో రాజీనామా చేస్తే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అది చాలా పెద్ద తలనొప్పి. ఎందుకంటే, అధికారం టీఆర్ఎస్ చేతిలో వుంది.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందాలా.? వద్దా.? అన్నదీ టీఆర్ఎస్ చేతిలోనే వుంటుంది.
టైమ్ చూసి రాజీనామా విషయమై రాజగోపాల్ రెడ్డిని దెబ్బకొట్టడానికి టీఆర్ఎస్ తనదైన వ్యూహాలు రచిస్తుంది కూడా. పైగా, ఉప ఎన్నిక వస్తే.. ఖర్చు తడిసి మోపెడైపోతుంది. కోట్లు ఖర్చు చేసి గెలిచినా, మళ్ళీ ఏడాది తిరగకుండానే ఎన్నికలు వచ్చే అవకాశం వుంది.. అప్పుడు మళ్ళీ ఖర్చు చేయాలంటే.. కుదరని పరిస్థితి వస్తుంది.
మొత్తమ్మీద, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షురూ చేసిన డ్రామా సాగుతూ సాగుతూ వుంది. సాగుతూనే వుంటుంది.