కెప్టెన్‌గా ఎవ‌రికి సాధ్యం కాని రికార్డుని త‌న ఖాతాలో వేసుకున్న విరాట్ కోహ్లీ

ర‌న్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీకు రికార్డులు కొత్తేమి కాదు. ఇప్ప‌టికే అనేక రికార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకున్న విరాట్ తాజాగా కెప్టెన్‌గా ఎవ‌రికి అంద‌ని రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. వివ‌రాల‌లోకి వెళితే భార‌త స్టైలిష్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్‌గాను, టీమిండియా కెప్టెన్‌గాను స‌త్తా చాటుతున్నాడు. లాక్‌డౌన్ త‌ర్వాత తొలిసారి త‌న టీంతో క‌లిసి ఆసీస్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన విరాట్ మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి రెండు వ‌న్డేల‌లో ఓటమి పాలయ్యారు. దీంతో సిరీస్ కోల్పోవ‌ల‌సి వ‌చ్చింది.

మూడో వ‌న్డే నుండి జైత్ర‌యాత్ర మొద‌లు పెట్టిన విరాట్ అండ్ టీం ..టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల‌లోను ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో విరాట్ సేన టీ 20 సిరీస్‌ని చేజిక్కించుకుంది. అయితే రెండో టీ20లో సాధించిన విజ‌య్ త‌ర్వాత‌.. కోహ్లీ కెప్టెన్‌గా అరుదైన రికార్డుని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డ్ ఏంటంటే ఆసీస్ గ‌డ్డ‌పై అన్ని ఫార్మాట్ల‌లో సిరీస్‌లు గెలిచిన ఏకైక భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లినే. మొత్తంగా చూస్తే సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెస్సీ త‌ర్వాతి స్థానంలో కోహ్లీ ఉన్నాడు

గ‌త ప‌ర్య‌ట‌న‌లో కోహ్లీ కెప్టెన్సీలో ఆసీస్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన భార‌త జ‌ట్టు టెస్ట్ సిరీస్‌తో పాటు వ‌న్డే సిరీస్‌ను గెలుచుకుంది. టీ 20 సిరీస్ 1-1తో స‌మ‌మైంది. దీంతో టీ 20 సిరీస్ ద‌క్కించుకోలేక‌పోయామ‌నే నిరాశ కోహ్లీలో ఉంది. అది ఈ సీజ‌న్‌లో తీర్చుకున్నాడు. వ‌రుస‌గా రెండు టీ20ల‌లో విజ‌యం సాధించి అరుదైన రికార్డుని త‌న పేరున లిఖించుకున్నాడు. ఇక మంగ‌ళవారం ఆస్ట్రేలియాతో మూడో టీ 20 మ్యాచ్ ఆడ‌నుండ‌గా, ఈ మ్యాచ్‌లోను భార‌త్ విజ‌యం సాధించి క్లీన్ స్వీప్ చేయాల‌నే క‌సితో ఉంది. ఈ మ్యాచ్ త‌ర్వాత భార‌త టీం ఆసీస్‌తో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడ‌నుంది.