హైదరాబాద్ లో వైఎస్ షర్మిల కీలక సమావేశం … కొత్త పార్టీ పై ప్రకటన చేస్తారా ?

Many doubts on Sharmila's letter 

ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల రేపు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులతో ఆమె భేటీ కానున్నారు. రేపు జరిగే ఆత్మీయ సమ్మేళనానికి అభిమానులు, అనుచరులు భారీగా తరలి రావాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే సమ్మేళనం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ వైసీపీ శ్రేణులు అంటున్నాయి. షర్మిల ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ఆమె హైదరాబాద్ కి చేరుకోనున్నారని సమాచారం. వైఎస్ఆర్ అభిమానులు ఈ సమావేశానికి రావాల్సిందిగా నేతలకు స్వయంగా కాల్ చేసి మరీ ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశం అజెండా ఏంటనేది మాత్రం వెల్లడి కావడం లేదు. షర్మిల కొత్త పార్టీ ఊహాగానాల నేపథ్యంలో రేపటి భేటీకి రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది.

ఇదిలా ఉంటే తెలంగాణలో ఏర్పాటు చేయబోయే తన కొత్త పార్టీకి సంబంధించిన నినాదం సైతం ఖరారైందని తెలుస్తోంది. ఈ పార్టీని రాజన్న రాజ్యం జగనన్న సంక్షేమం అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తాననే నినాదంతో గత ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లిన ఆయన తనయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. షర్మిల సైతం తెలంగాణలో తాను పెట్టబోయే పార్టీ కోసం ఓ బలమైన నినాదం ఉండాలని భావిస్తున్నారని.. ఇందుకోసం ఈ రకమైన నినాదాన్ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వాళ్లు ఎక్కువగా ఉన్నారని.. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల పట్ల కూడా తెలంగాణలోని ప్రజల్లో సానుకూలత ఉందని షర్మిల సన్నిహితులు భావిస్తున్నారట.