దేశంలోని కేశవానంద భారతి అంటే తెలియని వారు ఉండరు. ఆధ్యాత్మిక వేత్తగానే కాదు పొలిటకల్, లా, అడ్మినిస్ట్రేషన్ ఇలా ప్రతి పోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థి ఎప్పుడో అప్పుడు కేశవానంద భారతి కేసు అని చదివే ఉంటారు. ఆ స్వామి శివైక్యం చెందారు.
ప్రధాని సంతాం : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి(79) మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల అభివృద్ధికి కేశవానంద చేసిన కృషిని, సమాజ సేవని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని మోడీ తెలిపారు. భారతదేశ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, రాజ్యాంగాన్ని అయన గౌరవించే వారని, కేశవానంద భారతి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని మోడీ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో భాదపడుతూ ఆదివారం (సెప్టెంబర్-6) ఉదయం కేరళలోని కాసర్ గూడ్ లోని ఎడనీర్ మఠ్లో కేశవానంద భారతి శివైక్యం పొందారు.
కేశవానంద భారతి కేసు
రాజ్యాంగ హక్కులపై ఆయన చేసిన న్యాయపోరాటంతోనే దేశవ్యాప్తంగా కేశవానంద భారతి గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు కేసుల్లో స్వామి కేశవానంద భారతి కేసు చరిత్రాత్మకమైంది. కేసు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా ప్రాచుర్యం పొందింది. పలు కేసులకు దీనినే మైలురాయిగా తీసుకుంటారు. ఏకంగా 68 రోజుల పాటు ఈ కేసు విచారణ నడిచింది. ఏకంగా 13 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైన విస్తృత ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. 68 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కేశవానంద భారతికి అనుకూలంగా వెలువడింది.