మార్కెటింగ్ కంపెనీ దారుణమైన చర్య.. పని చేయలేదని కుక్కలా..

Kerala: కేరళలోని కలూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ తీసుకున్న చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పనితీరు తక్కువగా ఉందన్న కారణంతో కొంత మంది ఉద్యోగులకు అవమానకరంగా ప్రవర్తించడమే కాదు, వారిని కుక్కలా కట్టేసి మోకాళ్లపై నడిపించి, నేలపై పడేసిన నాణేలను నాలుకతో తీయమనడం వంటి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు టీవీ ఛానళ్లలో ప్రసారం కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై కార్మికశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి స్పందిస్తూ తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు రంగంలోకి దిగారు. సంస్థ యాజమాన్యం మాత్రం వీడియోలో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు జరుగుతున్నవని అంగీకరించకుండా, అవి కొన్ని నెలల కిందటివని వివరణ ఇచ్చింది. అప్పట్లో ఉన్న మేనేజర్ తొలగించబడ్డాడనీ, ఇప్పుడు కావాలనే ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారనీ చెబుతున్నారు. కానీ ఇదే నిజం కాదని మరోవైపు మిగతా ఉద్యోగుల వాదన ఉంది.

ఇక ఈ వ్యవహారంపై రాష్ట్ర మానవహక్కుల సంఘం సీరియస్‌గా స్పందించింది. హైకోర్టు న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తును ప్రారంభించింది. ఉద్యోగి పనితీరు బాగోలేదని ఇలా శారీరకంగా, మానసికంగా వేధించడం ఏమిటని తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఈ ఘటనపై హ్యుమన్ రైట్స్ యాక్టివిస్టులు కూడా మండిపడుతున్నారు.

పని చేయలేదని పనికిరాడని అంటారు కానీ, అలాంటి ఉద్యోగులకు మార్గనిర్దేశం చేయాల్సిందిపోయి కుక్కలతో పోల్చేలా వ్యవహరించడం సామాజికంగా కూడా అంగీకరించదగినది కాదు. ఇది కేవలం శిక్ష విధించే అంశం కాదు.. సంస్థలోని పనిసంస్కృతి, మానవత్వం గురించి తీవ్ర ఆలోచన చేసే స్థితిని చూపిస్తుంది. విచారణలు ఎలా సాగినా.. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉద్యోగం చేసే వారు మానవులే. మానవత కలిగిన విధానాలు తీసుకోవడం మాత్రమే సంస్థల బాధ్యత.

చంద్రబాబుకు బుద్ధి లేదు || Congress Tulasi Reddy Reacts On Cm Chandrababu Comments || Telugu Rajyam