కరోనా మూడో వేవ్: కేరళకు ఏమయ్యింది.?

దేశంలోకి మొదట కరోనా వైరస్ ప్రవేశించిందే కేరళ రాష్ట్రం ద్వారానే. చైనా నుంచి వచ్చిన ఓ కేరళ వ్యక్తి కరోనా వైరస్‌ని దేశంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దేశంలో కరోనా వైరస్ విస్తరించడానికి వేర్వేరు కారణాలున్నాయనుకోండి.. అది వేరే సంగతి. మొదటి వేవ్ ఎదుర్కోవడంలో కేరళ దేశానికే ఆదర్శంగా నిలిచింది. కానీ, కేరళలో ఓనం పండగ తర్వాత కరోనా వైరస్ పట్టపగ్గాల్లేకుండా విస్తరించేసింది. దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గినా, కేరళలో మాత్రం తగ్గడంలేదు. పైగా, అనూహ్యంగా పెరుగుతోంది. దాంతో, కేరళతోపాటు దేశవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దీన్ని మూడో వేవ్ అని అభివర్ణించగలమా.? అన్న విషయమై వైద్య నిపుణుల్లో చర్చ జరుగుతోంది. కేసులతోపాటు, మరణాలు కూడా పెరుగుతున్నాయి కేరళలో గత కొద్ది రోజులుగా. దేశంలో రాష్ట్రాల మధ్య రవాణా ఆంక్షలేమీ లేవు. పైగా, దాదాపుగా అన్ని రాష్ట్రాలూ కరోనా ఆంక్షల్ని పడలించాయి. దాంతో, కేరళ నుంచి వచ్చేవారిని ఆయా రాష్ట్రాల్లో ఒకింత అనుమానంగా చూడాల్సి వస్తోంది. చిత్రమైన విషయమేంటంటే, కరోనా వైరస్ ఒకరికి సోకితే, వారి ద్వారా ఎక్కువమందికి చేరడానికి పెద్దగా సమయం పట్టదు. ఆ లెక్కన, దేశంలో ఏ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువ వున్నా, అదే పరిస్థితి దేశమంతా వుంటుంది. కేరళలో రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు చేస్తుండగా, కొన్ని రాష్ట్రాల్లో టెస్టులు తగ్గించేయడం ద్వారా దేశంలో అసలు కరోనా తీవ్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకుతుండడంతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగిపోతున్నాయి.