KCR’s Master Plan : రాజకీయాల్లో రాజకీయ పరమైన విభేదాలు వేరు.. చట్ట సభలకు వచ్చేసరికి బాధ్యతలు వేరు. బీజేపీ శాసనసభ్యులైనంతమాత్రాన, వారు ప్రజా ప్రతినిథులు కాకుండా పోతారా.? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే, బీజేపీ సభ్యులు గందరగోళం సృష్టించారని ఆరోపిస్తూ సభ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేశారు.
సస్పెన్షన్ ప్రతిపాదన పెట్టింది మంత్రిగారే.. స్పీకర్ ఎలాగూ ప్రభుత్వం చెప్పినట్టే వ్యవహరిస్తారనుకోండి.. ఈ సంప్రదాయం ఎప్పటినుంచో వస్తోంది. అయినాగానీ, బడ్జెట్ సమావేశాల తొలి రోజే ఇలాంటి సప్పెన్షన్లతో సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్టు.?
గవర్నర్ బీజేపీ మనిషి కాబట్టి, గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాల్ని టీఆర్ఎస్ షురూ చేసిందన్న విమర్శలు ఓ పక్క గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతలోనే, బీజేపీ శాసన సభ్యుల సస్పెన్షన్.
ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బీజేపీ శాసనసభ్యుడిగా సభలో తొలిసారిగా అడుగు పెట్టారు. ఆయన మొహం చూడటం ఇష్టం లేకనో, అసెంబ్లీలో ఈటెల ఉనికిని భరించలేకనో ముఖ్యమంత్రి కేసీయార్ ఈ వ్యూహం పన్ని వుంటారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. (KCR’s Master Plan)
ఇదే విషయాన్ని ఈటెల అండ్ టీమ్ గట్టిగానే నినదిస్తోంది. ఇదేం దుర్మార్గమైన పాలన.. అంటూ బీజేపీ గుస్సా అవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తామని బీజేపీ శాసన సభ్యులు ఈటెల రాజేందర్, రఘునందన్, రాజా సింగ్ చెబుతున్నారు.