Kaleshwaram Project: కేసీఆర్‌కు కాళేశ్వరం నోటీసులు.. విచారణకు రావాల్సిందే!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో పెద్ద చిక్కే ఎదురైంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అతనితోపాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌లకు నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన లోపాలపై విచారణ చేపట్టిన కమిషన్, జూన్ 5వ తేదీలోగా హాజరై వివరణ ఇవ్వాలని సూచించింది. భారీ నిధులు ఖర్చైన ఈ ప్రాజెక్ట్‌పై ఒకదశలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ చర్య కీలకంగా మారింది.

కమిషన్ ఇప్పటివరకు 109 మందిని విచారించినప్పటికీ, ప్రధాన నిర్ణయాలను తీసుకున్న నేతల నుంచి అధికారిక స్పష్టత అవసరమని భావించింది. అధికారుల స్టేట్‌మెంట్ల ప్రకారం, ఆదేశాలన్నీ ప్రభుత్వం పెద్దల నుంచే వచ్చాయని వెల్లడించడంతో, కమిషన్ ఆ ముగ్గురు నేతలను నేరుగా విచారించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఏడుసార్లు గడువు పొడిగించుకున్న కమిషన్, జులై 31తో తన పనిని ముగించనున్నట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోయినట్లు వెల్లడైన సమయంలోనే, దీనిపై రాజకీయ దుమారం మొదలైంది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణను ఆదేశించింది. అప్పటి నీటిపారుదల, ఆర్థిక శాఖ మంత్రులైన హరీష్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు, ముఖ్యమైన ప్రాజెక్ట్ ఆమోదాలపై సంతకాలు చేసిన నేతగా కేసీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఇప్పుడు కమిషన్ నోటీసుల నేపథ్యంలో, ఈ ముగ్గురు నేతల సమాధానాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. నివేదిక విడుదలకు ముందు కీలక పరిణామాలకూ ఇది బీజం వేయనుంది. అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ అనంతరం ఎలాంటి చర్యలు ఉంటాయన్నది వేచి చూడాల్సిన అంశం.