కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి అడుగగడుగునా అధికార పార్టీ తెరాసకు కంగారు పుట్టిస్తూనే ఉన్నారు. కేసీఆర్ ఆధిపత్య నిరూపణకు ఏ ప్లాన్ వేసినా ముందుగా రేవంత్ రెడ్డే గుర్తొస్తున్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా కేసీఆర్ ను ఎదిరించి ఢీకొట్టి తీరుతానని రేవంత్ పట్టుబట్టి కూర్చొని ఉన్న సంగతి తెలిసిందే. అన్నట్టే అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. అందుకే ఏ పని చేసినా కేసీఆర్ కు రేవంత్ ఫీవర్ తగులుతోంది. ప్రస్తుతం కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల మీద దృష్టి పెట్టారు. సాధారణంగా అయితే కేసీఆర్ దుబ్బాక ఉపఎన్నికల మీద దృష్టి పెట్టేవారే కానీ ఎన్నికల సంఘం దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో పూర్తి దృష్టి ఎమ్మెల్సీ ఉపఎన్నికల మీదే పెట్టారు.
పైగా ఈ ఉపఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. మామూలుగా అయితే ఈ స్థానంలో తెరాసకే బలం ఎక్కువ. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 570 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారే. కాంగ్రెస్ పార్టీకి 152 మంది ఉండగా, బీజేపీ నుంచి 78 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అలాగే మరో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్వతంత్రులు ఉన్నారు. కనుక తెరాస తరపున కవిత ఎన్నిక లాంఛనమే. అసలు ఈ స్థానానికి ఏప్రిల్ 7నే పోలింగ్ జరగాల్సి ఉండగా ఇంతలోగా లాక్‌డౌన్ అమలులోకి రావడంతో పోలింగ్ వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు వచ్చే నెల 9న పోలింగ్ జరగనుంది.
ఈ ఐదు నెలల్లో పరిస్థితులు కొంచెం మారాయి. రేవంత్ రెడ్డి అంతర్గత రాజకీయాలతో నేరుగా తెరాసలోనే ముసలం పుట్టించాలని ప్లాన్ చేశారు. తెరాసలో అసంతృప్తితో ఉన్న నేతలను కూడదీసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తెరాస ప్రజాప్రతినిధులను తమవైపుకు తిప్పుకునే పనేదైనా చేస్తారేమోనని కేసీఆర్ కంగారు. అయితే ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో క్యాంప్ రాజకీయాలకు ఆస్కారం లేదు. కానీ సంప్రదింపులకు వేరే మార్గాలు ఉండనేఉన్నాయి. ఇప్పటికే కవిత ఎంపీ ఎన్నికల్లో ఓడాక కేసీఆర్ ఈగో గాయపడింది. అందుకే కవితను మండలిలో అయినా కూర్చోబెట్టాలనే పంతంతో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ తన పంతం ఎక్కడ నెగ్గకుండా చేస్తారోనని కంగారుపడుతున్నారు.