ఎప్పుడో ఒకరి మీద ఆధారపడి రాజకీయం చేయడం మంచిది కాదు. అలా ఆధారపడటం వలన ఎన్నో ప్రయోజనాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆధారపడితే అది కొంతకాలమే అయ్యుండాలి తప్ప శాశ్వతంగా కాదు. ఈ విషయం కేసీఆర్ కు బహు బాగా తెలుసు. అందుకే ఆయన ఈసారి గ్రేటర్ ఎన్నికలకు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్ ఆంధ్రా సెటిలర్ల అవసరం ఒక్క హైదరాబాద్ ఎన్నికల్లో మినహా మరెక్కడా అవసరం లేదు. ఆంధ్రా నుండి వచ్చి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో సెటిలైన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్లకు బల్దియా ఎన్నికల్లో ఓటు హక్కు ఉంది. చాలా చోట్ల గెలుపోటములను డిసైడ్ చేయగలరు.
అందుకే కేసీఆర్ రాష్ట్రం విడిపోయిన నాటి నుండి సెటిలర్ల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపించారు. ఆంధ్రా వాళ్లకు హైదరాబాద్లో ఎలాంటి భయమూ అక్కర్లేదని, స్వేచ్ఛగా బ్రతకొచ్చని, అందరూ సమానమేనని అంటూ దాన్నే ఫాలో అవుతూ వచ్చారు. ఈ కారణంగా ఇన్నాళ్లు ఇరు రాష్ట్రాల నడుమ సంబంధాలు బాగానే ఉన్నాయి. జగన్ తో సైతం కేసీఆర్ చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పాత జల వివాదాలు తెరపైకి వచ్చాయి. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. అక్కడి నుండి ఏపీ ప్రభుత్వం మీద దాడి మొదలైంది. మోదీకి లొంగిపోయి మోటార్లకు మీటర్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
లాక్ డౌన్ ముగిసి ఇన్నాళ్లు కావస్తోస్తున్నా ఇరు రాష్ట్రాల నడుమ ఆర్టీసీ రాకపోకలు లేవు. ఏపీ ఆర్టీసీ ఎన్ని మెట్లు దిగొచ్చినా లక్ష కిలోమీటర్ల మేర దూరాన్ని తగ్గించుకున్నా ఆంద్ర బస్సులు సరిహద్దుల్లోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ కారణంగా దసరా వేడుకకు రాష్ట్రానికి రాలేక అనేకమంది సెటిలర్లు ఇబ్బందిపడ్డారు. ఈ కోపాన్నంతా వారు గ్రేటర్ ఎన్నికల్లో చూపించే వీలుంది. కేసీఆర్ కూడ అదే కోరుకుంటున్నారు. సెటిలర్లు ఓట్లు వేయకపోయినా తాము గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోగలమని నిరూపించి భవిష్యత్తులో ఆంధ్రా సెటిలర్ల కోసం సర్దుకుపోవడం మానేసి హైదరాబాద్ మీద మరింత స్వేచ్ఛగా పాలన సాగించాలనేది కేసీఆర్ ఆలోచనట.