గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూస్తే దాని వెనుక పెద్దల ప్లానింగ్ ఉందని ఇట్టే అర్థమవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఒక్క శాతానికి పైగానే ఓటింగ్ నమోదైనా కూడ అవ్వాల్సిన స్థాయిలో కాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో 45.7 శాతం పోలింగ్ జరిగింది. మామూలుగా అయితే ఇది 50 శాతం వరకు ఉండాల్సి ఉందని విశ్లేషకుల అంచనా. ఆఖరి రెండు గంటల్లో పోలింగ్ నమోదైన తీరు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఈ 5, 6 శాతం పోలింగ్ డ్రాప్ అవడానికి మెయిన్ రీజన్ కేసీఆర్ పక్కాగా అమలుచేసిన ప్లానింగేనని అందరూ అంటున్నారు. ఆ ప్లానింగ్ ఏమిటీ అనుకుంటున్నారా.. అదే లాంగ్ వీకెండ్.
నవంబర్ 29న ఆదివారం, 30న గురునానక్ జయంతి.. ఈ రెండు కూడ సెలవు రోజులే. ఇక నవంబర్ 28న శనివారం కొన్ని బ్యాంకులకు, సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఆరోజు సెలవు ఉంది. ఇక ఎలాగూ డిసెంబర్ 1న పోలింగ్ కాబట్టి సెలవు ఉంటుంది. అలా చాలామందికి నాలుగు రోజులు వరుసగా సెలవులు కనిపించాయి. దీంతో ఆంధ్రా సెటిలర్లు చాలావరకు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. కాబట్టే పోలింగ్ శాతంలో తగ్గుదల కనిపించింది. ఇన్ని రోజులు సెలవు వస్తుందంటే బయటి వ్యక్తులు ఎవరైనా సరే సొంత ఊళ్లకు వెళ్లాలనే అనుకుంటారు. ఈ సంగతి ఈసీకి, ప్రభుత్వానికి తెలియనిది కాదు. అయినా లాంగ్ వీకెండ్ తర్వాతి రోజున అదనపు సెలవుతో పోలింగ్ పెట్టారు. ఇంకేముంది ఆంధ్రా సెటిలర్లు చాలామంది ఓటు వేయడానికి రాలేదు.
ఈ తరహాలో అమలు వెనుక కేసీఆర్ వ్యూహం ఉందని అంటున్నారు. కారణం ఆంధ్రా, తెలంగాణలకు నడుమ మునుపు ఉన్న సయోధ్య వాతావరణం లేకపోవడమేనని చెబుతున్నారు. జగన్, కేసీఆర్ మధ్యన మొదట్లో ఉన్నంత స్నేహపూర్వక పరిస్థితులు ఇప్పుడు లేవు. పాత జలవివాదాలు మళ్ళీ రాజుకున్నాయి. జగన్ రాయలసీమ కోసం నిర్మించాలనుకున్న పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అది చాలదన్నట్టు తెరాస మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 4 వేల కోట్లకు ఆశపడి జగన్ మోదీ తెచ్చిన విద్యుత్ బిల్లును ఆమోదించారని, రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారని అనేశారు. దీంతో రెండు రాష్ట్రాల మంత్రుల నడుమ మాటల యుద్దం నడిచింది.
దీంతో ఆంధ్రా సెటిలర్లు మరీ ముఖ్యంగా సీమకు చెందినవారు తెరాస తీరు పట్ల అసంతృప్తి ఫీలయ్యారు. వీళ్లంతా తమ కోపాన్ని గ్రేటర్ ఎన్నికల్లో చూపే అవకాశం ఉంది. అది గ్రహించి కేసీఆర్ ఈ వరుస సెలవుల ప్లాన్ ను అమలుచేసి తెలివిగా ఆంధ్రా ఓటర్లను ఓటింగ్లో పాల్గొనకుండా చేశారని, దాని వలన క్రాస్ ఓటింగ్ నుండి తప్పించుకోగలిగారని, ఒకవేళ వాళ్ళే గనుక ఓటింగ్లో పాల్గొని తెరాసకు వ్యతిరేకంగా ఏ కాణగ్రెస్ పార్టీకో లేకపోతే బీజేపీకు ఓట్లు వేసి ఉంటే ఫలితాల్లో గట్టి మార్పు ఉంటుందని చెప్పుకుంటున్నారు.