KCR National Party BRS : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని చాలాకాలంగా ఆయన ప్రయత్నిస్తున్నా అది కార్యరూపం దాల్చడంలేదు.
తెలంగాణలో రాజకీయ లబ్ది పొందేందుకే కేసీయార్, జాతీయ రాజకీయాలపై అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. అయినాగానీ, దేశ ప్రజలకు సరైన పాలన అందడంలేదనీ, బంగారు తెలంగాణ లాగనే, బంగారు భారతదేశం ఆవిష్కరణ దిశగా ప్రజలు ఆలోచన చేయాలన్నది కేసీయార్ ఉవాచ.
ఇదిలా వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా, భారతీయ రాష్ట్ర సమితి అవుతుందంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చిత్తశుద్ధి కలిగిన నాయకుడు కావాల్సి వుందనీ, ఆ నాయకత్వం తెలంగాణ నుంచే వెళుతుందనీ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ వ్యాఖ్యానించిన దరిమిలా, గులాబీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేసీయార్ జాతీయ ఆలోచన చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కేటీయార్కి కట్టబెట్టి, తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు కేసీయార్. అయితే, ఎందుకో ఆ ఎన్నికల్లో గెలిచినా, కేసీయార్ జాతీయ రాజకీయాలపై పునరాలోచనలో పడ్డారు.
వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు కేసీయార్ వెళితే, అది ఈ ఏడాది చివర్లో కావొచ్చు కూడా. అదే జరిగితే, కేసీయార్ బీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తారేమో.! కానీ, దక్షిణాది రాజకీయాల నుంచి ఓ బలమైన రాజకీయ శక్తి అంటూ పుట్టుకొస్తే, ఉత్తరాది రాజకీయ పెత్తనం ఊరుకుంటుందా.? వేచి చూడాల్సిందే.