తెరాసలో ఫ్యూచర్ లీడర్లకు కొదవలేదు. కేసీఆర్ తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయగల నాయకులు ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్నారు. వారే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు, కేసీఆర్ తనయుడు కేటీఆర్. ఇద్దరూ సమర్థులే. మాటల్లో, చేతల్లో ఒకరికొకరు తీసిపోరు. ఎలాంటి కార్యమైనా చేసుకురాగలరు. సంక్షోభం ఎలాంటిదైనా పార్టీని గట్టెక్కించగలరు. ఇద్దరికీ పార్టీ పగ్గాలు చేపట్టే సమాన అర్హతలు ఉన్నాయి. కాకపోతే సీనియారిటీ పరంగా హరీష్ రావు ఒకడుగు ముందే ఉంటారు. తొలి నుంచీ కేసీఆర్ వెనుకే అడుగులు వేస్తూ వెన్నుదన్నుగా ఉన్నారు హరీష్.
ఉద్యమం ముందు పార్టీలో, ఉద్యమంలో, ఆ తర్వాత ప్రభుత్వంలో హరీష్ రావు పాత్ర చాలా కీలకమైనది. పార్టీలో కేసీఆర్ తర్వాత ఆయనే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ కేటీఆర్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. కేసీఆర్ కుమారుడికి సర్వ హక్కులు ఇచ్చేశారు. అప్పటివరకు అన్నిటికీ కుడిభుజంలా ఉన్న హరీష్ రావును పక్కనబెట్టి కుమారుడిని ఎలివేట్ చేసే పని పెట్టుకున్నారు. కేటీఆర్ కూడ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఉహించినదానికంటే వేగంగా నాయకుడిగా ఎదిగిపోయారు. చూస్తుండగానే హరీష్ రావు వెనకబడిపోయారు. ఆయన్ను సిద్దిపేట వరకే పరిమితం చేశారు. మామ మీద అపర భక్తులు ఉన్న హరీష్ ఒకానొక దశలో ఆ వివక్షను తట్టుకోలేకపోయారు. అలిగారు కూడ.
కానీ కేసీఆర్ కు హరీష్ రావు సత్తా ఏమిటో తెలుసు. సరిగ్గా తేల్చుకుంటే పార్టీలో హరీష్ రావుకు మద్దతుదార్లు ఎక్కువే. అందుకే హరీష్ రావును ఎంత వెనక ఉంచినా పార్టీలో స్థిరంగానే ఉన్నారు. అయితే ప్రజెంట్ దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యత మొత్తాన్ని హరీష్ రావు భుజాల మీదే పెట్టారు కేసీఆర్. ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే హరీష్ రావు పని సగం ముగిసినట్టే అంటున్నారు. అసలు సోలోగా ఆయన మీద అంత భారం వేయడం వెనుక కేసీఆర్ వ్యూహం ఉందని, గెలిపించుకుని రాలేకపోతే ఆయన మీద అసమర్ధుడనే ముద్ర వేసేసి వెనక్కి నెట్టేయాలనేది కేసీఆర్ ఆలోచనని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మరి ఆ మాటలే నిజమైతే హరీష్ రావు దుబ్బాకలో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారు, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.