KCR Mark Punch : కేసీయార్ దెబ్బకి విలవిల్లాడుతున్న కాంగ్రెస్

KCR Mark Punch : రాహుల్ గాంధీ పట్ల సానుకూలంగా మాట్లాడటమే కాదు, జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించేందుకు ఎవరితోనైనా జతకట్టడానికి సిద్ధమంటూ సంకేతాలు పంపడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

నిజానికి, ఇది కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చే అంశమని తొలుత అంతా అనుకున్నారు. అయితే, పోటీ టీఆర్ఎస్ – బీజేపీ మధ్యనేనని కేసీయార్ చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీని రేసులోంచి దూరంగా గెంటేశారు కేసీయార్. కేసీయార్ రాజకీయ వ్యూహాలు ఇలాగే వుంటాయ్ మరి.

కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే బయట నుంచి మద్దతివ్వొచ్చు.. అన్నట్టుగా వుంది కేసీయార్ తీరు. కానీ, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించి అధికారంలోకి రావాలని చూస్తోంది కాంగ్రెస్. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి పీఠమెక్కాలనుకుంటున్నారు.. అందుకు అనుగుణంగా టీడీపీని వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరి, తక్కువ సమయంలోనే పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం దక్కించుకున్నారు.

ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నట్టు, కాంగ్రెస్ పార్టీని రేసులోంచి బయటకు పంపేసి, తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పొలిటికల్ ఈక్వేషన్‌కి స్కెచ్ వేసేశారు గులాబీ బాస్.

‘ససేమీరా తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతిచ్చేది లేదు..’ అని రేవంత్ రెడ్డి ఎంత గింజుకున్నా లాభం లేదు. ఎందుకంటే, జాతీయ స్థాయిలో పొత్తుల్ని కాంగ్రెస్ అధిష్టానమే డిసైడ్ చేస్తుంది. కేసీయార్ అందించిన సానుకూల సమాచారంతో, గులాబీ పార్టీతో చర్చల్ని కాంగ్రెస్ అధిష్టానం మొదలు పెట్టేలానే వుంది.