KCR Mark Politics : కేసీయార్ మార్కు రాజకీయం: తెలంగాణలో ఏంటీ రాజకీయ గందరగోళం.?

KCR Mark Politics : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారన్న చర్చ ఈనాటిది కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారకరామారావు నియామకం, కేసీయార్ జాతీయ రాజకీయాల ఆలోచన నేపథ్యంలోనే జరిగిందన్న ప్రచారం అప్పట్లో జరిగింది.

కానీ, జాతీయ రాజకీయాల గురించి అడపా దడపా మాట్లాడటం తప్ప, సరైన కార్యాచరణ అయితే ఇంతవరకు కేసీయార్ రూపొందించలేదు, ఆ దిశగా అడుగులేయడంలేదు కూడా. కొన్నాళ్ళ క్రితం ఫెడరల్ ఫ్రంట్ అన్నారు.. ఇప్పుడేమో పీపుల్స్ ఫ్రంట్ అంటున్నారు.

‘ఖచ్చితంగా జాతీయ రాజకీయాల గురించి ఆలోచన చేస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ యేతర రాజకీయ శక్తులతో సంప్రదింపులు జరుపుతాం..’ అని తాజాగా కేసీయార్ పునరుద్ఘాటించారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిందేనని కేసీయార్ కుండబద్దలుగొట్టేస్తున్నారు.

మోడీ సర్కారు సంగతి తర్వాత, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో రాజకీయాలు ఎలా మారబోతున్నాయో ఏమో.! ప్రస్తుతానికైతే కేసీయార్‌కి సరైన రాజకీయ ప్రత్యర్థి తెలంగాణలో లేరు. కానీ, రాజకీయాల్లో ఏ క్షణమైన అనూహ్యమైన మార్పులు రావొచ్చు.

దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ప్రజా వ్యతిరేకత వుందన్న విషయం సుస్పష్టమైపోయింది. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూస్తున్న వైనం కేసీయార్‌కి కూడా అర్థమయిపోయింది. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుడనే గందరగోళం కేసీయార్ సృష్టించారన్నమాట.