రాజకీయ పునరేకీకరణ అంటే ఏంటి కేసీయార్ దొరా.?

KCR Mark Politics Again Soon

KCR Mark Politics Again Soon

తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ‘పునరేకీకరణ’ అనే మాట తెరపైకొచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. బహుశా దానికి ఆయన పేటెంట్ హక్కు పొంది వున్నారేమో. బంగారు తెలంగాణ కోసం తెలంగాణలో రాజకీయ శక్తులన్నీ ఒక్కటవ్వాలని ఆయన పదే పదే పిలుపునివ్వడం చూస్తున్నాం. ఆ మాటకొస్తే, తెలంగాణ ఉద్యమ కాలంలోనూ కేసీఆర్ ఈ అస్త్రాన్నే వాడారు.. ఇతర రాజకీయ పార్టీల్ని నిర్వీర్యం చేశారు. ప్రజాస్వామ్య పునాదులు బలంగా వుండలంటే.. అధికార పక్షంతో సమానంగా విపక్షాలు కూడా బలంగా వుండాలి. అయితే, రాజకీయాల్లో బాధ్యతారాహిత్యం పెరిగి, జవాబుదారీతనం తగ్గేసరికి.. విపక్షాలు అనేవి, అధికార పార్టీలకు మింగుడుపడ్డంలేదు.

విపక్షాలంటేనే ప్రగతికి అడ్డంకి.. అనే స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయి. తెలగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందంటే, దానికి కారణం కేసీఆర్ ప్రతిపాదించిన పునరేకీకరణ వ్యూహమే. చిత్రమేంటంటే, ప్రధాన రాజకీయ పార్టీలు నాశనమైపోతున్నా తెలంగాణలో మజ్లిస్ పార్టీ తన బలాన్ని కోల్పోవడంలేదు. ఆ ఒక్క పార్టీకి మాత్రం పునరేకీరణ వర్తించేలా చేయడంలేదు కేసీఆర్. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత మళ్ళీ రాజకీయ పునరేకీకరణ వుంటుందట. అంటే, విపక్షాల్ని నాశనం చేయడమన్నమాట. సిద్ధాంతాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు పార్టీలు మారడమనేది ఒకప్పటి వ్యవహారం. పూటకో పార్టీ మార్చడమే నేటి నయా రాజకీయం. కప్పల తక్కెడగా రాజకీయ వ్యవస్థ మారిపోయాక, దూకుళ్ళు తప్పవు. ఇప్పుడు అధికారం కేసీఆర్ చేతుల్లో వుంది గనుక ఇలా.. రేప్పొద్దున్న అధికారం కోల్పోతే.. కాంగ్రెస్, టీడీపీల కంటే దారుణమైన పరిస్థితి గులాబీ పార్టీకి రావొచ్చు కదా.