రాజకీయాలంటేనే పబ్లిసిటీ అన్నట్టు.! ఔను, పబ్లిసిటీ లేకపోతే రాజకీయం లేదు. ప్రజల్ని ఏమార్చడం, వంచించడం.. ఇవన్నీ వుంటాయి రాజకీయాల్లో. అసలు రాజకీయం అంటే ఏంటి.. ప్రజా సేవ. కానీ, ఆ ప్రజలు ఇబ్బంది పడేలా రాజకీయ నాయకులు సేవ చేసేస్తున్నారు. అదే రాజకీయ దౌర్భాగ్యమంటే.!
తెలంగాణ రాష్ట్ర సమితి, మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓ భారీ షో ప్లాన్ చేశారు. వేలాది కార్లు మునుగోడు వైపుకు కదిలాయి.
గ్రేటర్ హైద్రాబాద్ పరిధి నుంచి కూడా పెద్దయెత్తున కార్లను సమీకరించారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ ఝామ్‌లు తలెత్తాయ్. ఇదేం పద్ధతి.? అని ఎవరైనా ప్రశ్నించారా.? అంతే సంగతులు. ఎందుకంటే, అది అధికార పార్టీ హంగామా. ప్రజలు నానా కష్టాలు పడినాసరే, ‘షో’ చేసి తీరాల్సిందే.!
జాతీయ రహదారిపైనా గంటల తరబడి ట్రాఫిక్ సమస్యల్ని ఎదుర్కొన్నారు వాహనదారులు. ఇంత పెద్ద రోడ్ షో అవసరమా.? ఏ ప్రజల్ని ఉద్ధరించేస్తున్నామని చెప్పడానికి, ఇప్పుడిలా ప్రజల్ని ట్రాఫిక్‌లో చిక్కుకుపోయేలా చేసి, నరకయాతన పెట్టడం.!
తెలంగాణ రాష్ట్ర సమితి అనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే అని కాదు.. దేశంలో రాజకీయాలే ఇలా తగలడ్డాయ్.! హెలికాప్టర్‌లో వెళ్ళి వచ్చే అవకాశం వున్నా, ఒక్కోసారి ఇలాంటి ‘షో’ చెయ్యాల్సిందే. దీన్నే బలప్రదర్శన అంటారు. డబ్బులు ఖర్చు చేసి, జనాన్ని రప్పించుకుని, ‘ఇదీ మా బలం’ అని చూపించుకుంటే, అది బలమైపోదు.. వాపు అవుతుంది.