దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు చేసుకుంటున్నాయి. దుబ్బాక ఫలితాలు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటి వరకు తమకు కేవలం కాంగ్రెస్ మాత్రమే పోటీ అనుకున్న కేసీఆర్ కు బీజేపీ రూపంలో మరో బలమైన శత్రువు తయారైంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభావం తగ్గిపోతుందని పసిగట్టిన కేసీఆర్ నూతన పతకాన్ని రచించారు. ఈ వ్యూహంతో బీజేపీని, కాంగ్రెస్ ని రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
కేసీఆర్ జీహెచ్ఎంసీ వ్యూహం
దుబ్బాక ఎన్నికల్లో వచ్చిన ఫలితం మళ్ళీ రిపీట్ కాకూడదని ఇప్పటి వరకు ఉన్న చేసిన తప్పులను సరిదిద్దుకొనే పనిలో పడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడానికి హైదరాబాద్ ప్రజలను ఆకట్టుకోవడానికి వరాలు ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ వాసులకు ఆస్తిలో పన్నులో 50%ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మున్సిపల్ కార్మికులకు మొదట కరోనా సమయంలో జీతాలను పెంచారు కానీ మళ్ళీ మధ్యలోనే ఆపేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ పెంచడానికి సిద్ధమయ్యారు. అలాగే వరదల నష్టపరిహారం అందని వారు మళ్ళీ మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని వెల్లడించారు. ఇలా హైదరాబాద్ వాసులకు వరాలు ప్రకటిస్తూ ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ వ్యూహం రచించారు.
కేవలం ఎన్నికల కోసమే
ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న పనులు కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే తప్ప అందులో చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆస్తిపన్నును 50% తగ్గించినా కూడా ప్రజలకు లాభం లేదని, ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్‌ఎస్, రెగ్యులేషన్ ఖర్చులతో పోల్చుకుంటే ప్రభుత్వం వారి దగ్గరి నుంచి ఫీజుల రూపంలో తీసుకున్న దానికంటే పెద్దగా ఇచ్చేది ఏమీలేదని విమర్శిస్తున్నారు. అలాగే కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్మికులకు మాత్రమే ఎందుకు జీతాలు పెంచారని, రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులందరికి ఎందుకు పెంచడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నలకు టీఆర్ఎస్ నాయకులు ఎలా సమాధానం చెప్తారో వేచి చూడాలి.