KCR Josyam : మోడీ సర్కారుపై కేసీయార్ జోస్యం నిజమయ్యేనా.?

KCR Josyam : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ రాజకీయాలపై చూపబోయే ప్రభావమెంత.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ చాలా చాలా బలమైన రాష్ట్రం రాజకీయంగా. అయితే, ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని బీజేపీ ఇంకోసారి నిలబెట్టుకోగలదా.? అంటే, అంత తేలికైన వ్యవహారమేమీ కాదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గనుక బీజేపీ ఓడిపోతే, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ త్వరలోనే అక్కడా అధికారం కోల్పోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జోస్యం చెబుతున్నారు. కానీ, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి లోక్‌సభలో సంపూర్ణ బలం వుంది. సో, యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడినా, కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు.

అయితే, ఓ పెద్ద రాష్ట్రంలో అధికారం కోల్పోవడమేంటే, ఆ ప్రభావం ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ మీద పడుతుంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతాయి.. మోడీ పట్ల ధిక్కార స్వరాలూ పెరుగుతాయి. ఫలితంగా జాతీయ స్థాయిలో బీజేపీ అనూహ్యంగా దెబ్బతినొచ్చు.

ఇంతకీ, యూపీలో బీజేపీ పరిస్థితేంటి.? అంటే, ఆ పార్టీని ఓడించే స్థాయిలో విపక్షాలు అక్కడ బలంగా లేవు. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.. ఇవేవీ బీజేపీని ఓడించేలా లేవన్నది నిర్వివాదాంశం. మజ్లిస్ పార్టీ ఎటూ మైనార్టీ ఓటు బ్యాంకుని చీల్చబోతోంది. ఇతరత్రా పార్టీల ప్రభావం కూడా యోగీ సర్కారు వ్యతిరేకత ఓటు బ్యాంకుని చీల్చేస్తాయి.

ఇలా ఈ సమీకరణాలన్నీ లెక్కేసుకుంటే మాత్రం, యూపీలో బీజేపీకి వచ్చిన ఇబ్బందేమీ లేదనే భావించాలేమో. సో, కేసీయార్ అంచనా తప్పేలానే కనిపిస్తోంది.