తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యు చట్టం ప్రక్షాణనకు రంగం సిద్దం చేసిన సంగతి తెలిసిందే. సమూల ప్రక్షాణనతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి భూ కుంభకోణాలకు చెక్ పెట్టడానికి పెద్ద ఎత్తునే ముందుకు కదులుతున్నారు. బూజు పట్టిన రెవెన్యు చట్టాన్ని మార్పు చేసి కొత్త చట్టంతో తెలంగాణ ప్రజల్లో నూతనొత్సాహాన్ని నింపాలని తహతహలాడుతున్నారు. గ్రామ స్థాయి వీఆర్ ఓ దగ్గర నుంచి ఎమ్మార్వో వరకూ జరిగే అక్రమ దందాలను అరికట్టేందుకు నడుం బిగించి ముందుకు కదులుతున్నారు. తెలంగాణలో ఏ ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లినా తక్షణం పని జరిగిపోవాలి.
అదీ భూ రిజిస్ర్టేషన్ అయినా ఇతర ఏ పనులైనా సరే! ప్రజల వద్దకే కొత్త రెవెన్యూ చట్టం అన్నట్లు అధికారిక పార్టీ నేతలు చెబుతున్నారు. ఇది అధికార ప్రభుత్వం వెర్షన్. అయితే ఆ రాష్ర్ట బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ ఈ చట్టంపై సంచలన ఆరోపణలు చేసారు. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఎల్ ఆర్ ఎస్ స్కీంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి తన అక్రమ ఆస్తుల్ని క్రమబద్దీకరించుకునేందుకే ఎల్ ఆర్ ఎస్ ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. తెల్ల పాస్ బుక్కులను నల్ల పాస్ బుక్కులగా మార్చటం తప్పించి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కేసీఆర్ అక్రమ ఆస్తుల గుట్ట రట్టవుతుందనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు.
హైదరాబాద్ ఔటర్ ఫరిదిలో కేసీఆర్ ..అతని బంధువులకు ఉన్న స్థలాల్ని కాపాడుకోవడానికే ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారని నిప్పులు చెరిగారు. చట్టాలు తీసుకొచ్చినంత మాత్రాన చేసిన అవినీతి మాసిపోదని…అది ఏదో రోజు కచ్చితంగా బయటపడుతుందని మండిపడ్డారు. 2023 లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినంగా ప్రకటిస్తామన్నారు. బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. ఆయన సారథిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి అధికార పక్షంపై తొలి నుంచి విమర్శలు గట్టిగానే గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.