బీజేపీకి జాకీలేసి పైకి లేపుతున్న కేసీయార్.?

అసలు భారతీయ జనతా పార్టీకీ, తెలంగాణ రాష్ట్ర సమితికీ ఎక్కడ చెడింది.? ఏడేళ్ళుగా బీజేపీ – టీఆర్ఎస్ తెరవెనుకాల ‘మిత్రులుగానే’ వుండి, ఇప్పుడెందుకు బస్తీ మే సవాల్.. అంటూ విరుచుకుపడిపోతున్నట్లు.? ఫెడరల్ ఫ్రంట్ గురించి అడిగితే, కేసీయార్ ఉలిక్కిపడతారెందుకు.? చాలా ప్రశ్నలున్నాయ్ ఇలాంటివి. సమాధానాలే దొరకట్లేదు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక దెబ్బ కేసీయార్ ఊహించనిదేమీ కాదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఓడిపోతామని తెలుసు కాబట్టే, కేసీయార్ కనీసం ప్రచారానికి వెళ్ళలేదన్న గుసగుసలు మొదట్లోనే వినిపించాయి. సరే, ఆ ఎన్నికల వ్యవహారం వేరే చర్చ.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న బీజేపీ, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో గణనీయంగా కోలుకుంది. బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా సత్తా చాటింది. నిజానికి, ఆ లోక్ సభ ఎన్నికలు తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చావు దెబ్బ లాంటివే.

అయితే, కేసీయార్ అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీకి సహకరిద్దామనుకుంటే, కాంగ్రెస్ కూడా లాభపడిందనే అభిప్రాయాలు వినిపిస్తుంటాయి రాజకీయ విశ్లేషకుల నుంచి. దాన్ని టీఆర్ఎస్ నిర్మొహమాటంగా ఖండించేయడం సంగతెలా వున్నా, గులాబీ రాజకీయాలు బాగా తెలిసినవారికి, ‘అది నిజమే..’ అన్న అభిప్రాయం కలగకమానదు.

గత రెండ్రోజులుగా కేసీయార్ స్వయంగా మీడియా ముందుకొచ్చి, బీజేపీని తూర్పారబడుతుండడం చూస్తోంటే, ఇదంతా బీజేపీకి జాకీలేసి పైకి లేపడమే అన్న భావన కలుగుతోంది చాలామందికి. కానీ, కేసీయార్ అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, టీఆర్ఎస్‌ని ఆయనే తన రాజకీయ వ్యూహాలతో బొందపెట్టేస్తున్నారిప్పుడు.. అచ్చం చంద్రబాబు తెలంగాణలో టీడీపీని నాశనం చేసుకున్నట్టుగా.