తెలంగాణ కాంగ్రెస్ లో బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తాను చేసే వ్యాఖ్యల వల్ల నిత్యం వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. అయితే తాజాగా మరో విషయంలో రేవంత్ రెడ్డి మళ్ళీ వివాదంలో చిక్కుకోబోతున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నారు.
భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. కోటి పది లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఎమ్మార్వో నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే అధికారులు సోదాలు జరిపినప్పుడు నాగరాజుతో పాటు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి కందాటి అంజి రెడ్డి కూడా ఉన్నారు. ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులకు రేవంత్ రెడ్డికి సంబందించిన కొన్ని ల్యాండ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన కొన్ని పత్రాలు కూడా అంజి రెడ్డి ఇంట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కందాటి అంజిరెడ్డి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మాత్రమే కాదు కాంగ్రెస్ నేత కూడా. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలో రేవంత్ రెడ్డి కోసం అంజిరెడ్డి పని చేశారు. ముందుగా ఆయన తెలుగుదేశం పార్టీ నేత. 2014లో ఆయన మల్లారెడ్డి కోసం పని చేశారు. కీసర మండలంలోని కొన్ని గ్రామాల్లో ఆయనకు పట్టు ఉంది. అయితే ఆయన మల్లారెడ్డితో పాటు టీఆర్ఎస్‌లో చేరలేదు. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కోసం పని చేయాలని కోరినా అంజిరెడ్డి చేయలేదు. రేవంత్ రెడ్డితో పాటు నడిచారు.రేవంత్ రెడ్డికి, అంజి రెడ్డికి మంచి బంధాలు ఉండటం వల్ల ఈ కేసులో రేవంత్ రెడ్డికి కూడా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఈ కేసులో లంచం ఇస్తున్నవారు ఏసీబీకి ఫిర్యాదు చేయలేదు కానీ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. సమాచారం లేకుండానే అధికారులు చేస్తున్న దాడులను చూస్తుంటే అవన్నీ రేవంత్ ను టార్గెట్ చేసే జరిగి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అధికారులు విడుదల చేస్తున్న ప్రతి అంశంలో రేవంత్ పేరు ఉండటం ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ అనుమానాలు నిజమైతే రానున్న రోజుల్లో తెలంగాణలో రసవత్తమైన రాజకీయాలు జరగనున్నాయి.