దుబ్బాక ఉప ఎన్నికల సార్వత్రిక ఎన్నికల కంటే రసవత్తరంగా మారాయి. ఎన్నికలు దగగ్రేపడే కొద్దీ ప్రధాన పార్టీల్లో పంతం పెరుగుతోంది. నిత్యం ఏదో ఒక ఉద్రిక్తత చోటుచేసుకుంటోంది. మొదటి నుండి ఈ ఎన్నికల్లో ప్రహన్ పోటీ తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉన్నట్టు కనిపించింది. కాంగ్రెస్ తన అభ్యర్థిగా చెరుకు ముత్యం రెడ్డిని ప్రకటించడంతో తెరాస గెలుపు కొద్దిగా కష్టమే అనుకున్నారు. టికెట్టును మరణించిన రామలింగారెడ్డి సతీమణి సుజాతకు ఇవ్వడంతో సానుభూతి అంశాన్ని పూర్తిగా తనవైపుకు తిప్పుకుంది తెరాస. పైగా సిట్టింగ్ స్థానం కావడం మరింత అనుకూలించే అంశం. హరీష్ రావు వ్యూహాలు కూడ సఫలమవుతున్నాయి.
ఇలా అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ తెర మీదికి దూసుకొచ్చింది. బీజేపీ అభ్యర్థి మనుషుల వద్ద డబ్బులు దొరికాయని ఆరోపణలు రావడం, బండి సంజయ్ దీక్ష వంటి విషయాలు జనం దృష్టిని బీజేపీ మీద పడేలా చేశాయి. బీజేపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీచేసిన రగునందం రావే ఈసారి కూడా బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 22 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. తెరాస అభ్యర్థి రామలింగారెడ్డికి 89 వేల ఓట్లు పడ్డాయి. ఇద్దరి మద్దతా 67 వేల ఓట్ల తేడా ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ బీజేపీ పుంజుకున్న దాఖలాలు కూడ లేవు. మరిప్పుడు బీజేపీ ఎన్నికల్లో హాట్ కంటెస్టెంట్ అయిపోయింది.
ఈ అనూహ్య మార్పుకు కారణం ఎవరయ్యా అంటే అధికార పక్షమనే అనాలి. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని వదిలేసి మూడు నాలుగు రోజులుగా తెరాస గురి మొత్తం బీజేపీ మీదే ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, దీక్షలు, నిరసనలు, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఊహించని విధంగా తిరగబడటంతో బీజేపీ బాగా హైలెట్ అయింది.. ఎంతలా అంటే తెరాసకు పోటీ బీజేపీయే అనేంతలా. ఈ మార్పు ఖచ్చితంగా బీజేపీకి మైలేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీ ఎన్నికల్లో గెలవకపోయినా గతం కంటే ఎక్కువ ఓట్లు రాబట్టుకుని కేసీఆర్ కలలు కంటున్న లక్ష మెజారిటీ మీద దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.