KCR Fighting : లేని శతృవుతో యుద్ధం చేస్తున్న సీఎం కేసీయార్.!

KCR Fighting : అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారు.? వాస్తవానికి తెలంగాణలో ప్రస్తుతానికైతే పార్టీల పరంగా, పార్టీల బలాల పరంగా చూసుకుంటే, కేసీయార్‌కి ఇద్దరే రాజకీయ ప్రత్యర్థులున్నారు. ఒకరేమో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇంకొకరు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

అయితే, తెలంగాణ రాష్ట్ర సమితిని ఇప్పటికిప్పుడు ఢీకొట్టేసి, అధికారంలోకి వచ్చేంత సీన్ కాంగ్రెస్ పార్టీకిగానీ, బీజేపీకిగానీ లేవు. ఈ విషయం అందరికన్నా బాగా కేసీయార్‌కే తెలుసు. దుబ్బాకలో గులాబీ పార్టీ ఓడటానికీ, హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి దెబ్బ తగలడానికీ బలమైన కారణాలే వున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా వుందని కాదు, వేరే సమీకరణాలు అక్కడ బాగా పని చేశాయంతే.

ఇక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సంగతి సరే సరి. తలపండిన రాజకీయ నాయకుడు కేసీయార్.. ఈ వాస్తవాలు తెలియకుండా వ్యవహరిస్తారని ఎలా అనుకోగలం.? లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పుంజుకున్నాయంటే, దానికి కారణం తెలంగాణ రాష్ట్ర సమితి అతి నమ్మకం. ఏమో, గుర్రం ఎగరావచ్చు.. అన్నట్టు టీఆర్ఎస్ తప్పిదాలు చేస్తే తప్ప, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి పెద్దగా అడ్డంకులేమీ లేవు.

అయినా, కేసీయార్.. చీకట్లో లేని శతృవుని ఊహించుకుని కత్తి దూస్తున్నారు. కేంద్రంపై పోరాటమంటారు.. ఇంకోటేవో చెబుతారు. శతృవు లేకపోతే యుద్ధమే వుండదు. సో, తన వీరత్వాన్ని చూసుకోవడానికి లేని శతృవుని జనానికి కేసీయార్ చూపించాలనుకుంటున్నారేమో.!