KCR: రూటు మార్చిన కేసీఆర్…. ప్రజా క్షేత్రంలోకి రానున్న గులాబీ బాస్?

KCR: ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు కెసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు అయితే 2023లో జరిగిన ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బిఆర్ఎస్ ఓటమిపాలు అయ్యింది. ఇలా కెసిఆర్ ఓడిపోయినప్పటి నుంచి కూడా పూర్తిగా తన ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం అయ్యారు.

ఈ విధంగా కెసిఆర్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఈయన మాత్రం అసెంబ్లీకి వెళ్లక పోవటంతో ఎంతోమంది కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సూచనలు సలహాలు ఇవ్వాలంటూ కోరారు. ఇక కెసిఆర్ ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం అయినప్పటికీ ఈయన మాత్రం పూర్తిస్థాయిలో రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి కొద్ది రోజులలో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలపై కేసీఆర్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. ఈ తరుణంలోనే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏర్పడిందని కేసీఆర్ ఇటీవల నేతల సమావేశంలో మాట్లాడారు. ఈ సమయంలో కేసీఆర్ సైతం బీసీ – రైతు అంశాల పైన రెండు భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం వేదికలను ఖరారు చేసారు. ఈ సభల ద్వారా తిరిగి కెసిఆర్ ప్రజాక్షేత్రంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.

కామారెడ్డి వేదికగా బీసీ గర్జన, గజ్వేల్ వేదికగా రైతు గర్జన నిర్వహించాలని నిర్ణయించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది.