వైసీపీని కెలికి పెద్ద తప్పు చేస్తున్న టీఆర్ఎస్.!

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు రెచ్చగొడుతున్నట్లు.? ఇదేమీ అంతు చిక్కని ప్రశ్న కాదు. జస్ట్, పాపులారిటీ కోసమే తెలంగాణ నేతలు వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. వైసీపీ మీద అనడం కంటే, వైసీపీ పాలన మీద.. అనడం కరెక్టేమో.!
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన బాగోలేదు.. తెలంగాణలో అద్భుతమైన పాలన వుంది..’ అని చెప్పుకోవాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి తాపత్రయం. నిజమే, తెలంగాణ ధనిక రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. కానీ, పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ ఎందుకు అప్పులు చేయాల్సి వస్తోంది.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు బాగోకపోవచ్చు.. తెలంగాణలో అద్భుతంగా వున్నాయా.? ఏపీలో టీచర్లను ప్రభుత్వం వేధిస్తోందట. మరి, తెలంగాణలో వివిధ వర్గాలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నట్లు.? ఇలా బోల్డన్ని ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.

కెలుక్కోవడమంటే ఇదే మరి.! వైసీపీ మద్దతుని తెరవెనుకాల తీసుకుంటూ, వచ్చే ఎన్నికల్లో కాస్త తేలిగ్గానే గట్టెక్కేసే అవకావం వుంది తెలంగాణ రాష్ట్ర సమితికి. అలా జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినట్లవుతుంది.

కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి పక్క రాష్ట్రాన్ని గెలికామనుకుని, తమను తామే కెలికేసుకుంటోంది.. తమ విజయావకాశాల్ని దెబ్బ తీసుకుంటోంది. ‘డ్యామేజీ చాలా ఎక్కువ జరిగిపోయింది..’ అంటూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి వైసీపీ నేతలు కొంత సంయమనం పాటిస్తున్నట్లే లెక్క. సంయమనం కోల్పోతే, వ్యవహారం వేరే లెవల్‌లో వుంటుంది తెలంగాణ రాష్ట్ర సమితికి.