ఒకప్పుడు హ్యాండిచ్చిన ఆ బడా నేతను జగన్ పార్టీలోకి రానిస్తారా ?

ఒక్కోసారి ఏదో ఆశించి ఒక పనిచేస్తే ఇంకేదో అవుతుంటుంది.  సరిగ్గా ఇదే బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ విషయంలో జరిగింది.  కన్నా ఇప్పుడంటే సాదాసీదా  నాయకుడిగా మిగిలిపోయారు కానీ ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోపేరున్న నేతగా చెలామణీ అయ్యారు.  రాష్ట్రంలోనే పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన గుంటూరు జిల్లా పెదకూరపాడు నుండి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనది.  1989, 94, 99, 2004 లో ఆయన విజయబావుటా ఎగరవేశారు.  గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆయనది ప్రముఖ పాత్ర పోషించారు.  కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడ పనిచేశారు. 

Kanna Lakshmi Narayana willing to join in YSRCP
Kanna Lakshmi Narayana willing to join in YSRCP

కానీ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన పరిస్థితి రావడంతో  వైసీపీలోకి వెళ్ళాలా బీజేపీలో చేరాలా అనే   మీమాంసలో ఉండగానే   ఆయన్ను  బీజేపీ హైకమాండ్ సంప్రదించి పార్టీ అధ్యక్ష పదవితో పాటు కేంద్ర స్థాయి పదవికి కూడ హామీ ఇచ్చిందని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.  అందుకే వైసీపీలో  మంచి భవిష్యత్తు ఉన్నా ఢిల్లీ లెవల్లో రాణించవచ్చని ఆయన బీజేపీలోకి వెళ్లిపోయారు.  కానీ ఇప్పుడు మాత్రం ఆయన సిట్యుయేషన్ దారుణంగా   తయారైంది.  ఇటీవలే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి ఆయన్ను తొలగించి సోము వీర్రాజును అపాయింట్ చేసింది బీజేపీ అధిష్టానం. 

Kanna Lakshmi Narayana willing to join in YSRCP
Kanna Lakshmi Narayana willing to join in YSRCP

ఆ టైంలో ఆయన్ను జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలకు వాడుకోవాలని అనుకుంటున్నారని, అందుకే అధ్యక్ష పదవి నుండి తీసేశారని, త్వరలో జాతీయ స్థాయికి తీసుకువెళతారని అంతా అనుకున్నారు.  కానీ తాజాగా జేపీ నడ్డా ప్రకటించిన కార్యవర్గంలో కన్నా పేరు లేదు.  ఏపీ నుండి పురంధేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశమా ఇచ్చారు కానీ కన్నాను పక్కనపెట్టేశారు.  ఈ పరిణామంతో కన్నా ఆశలు అడియాశలయ్యాయి.  దీంతో ఆయన పునరాలోచనలో పడ్డారని, పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని, అది కూడ గతంలో వెళ్లాలని అనుకున్న వైసీపీలోకే అని అంటున్నారట.  మరి అప్పుడు హ్యాండిచ్చిన కన్నాను ఇప్పుడు జగన్ అక్కున చేర్చుకుంటారా అన్నది డౌటే మరి.