సాధారణంగా ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యరి విజయం సాధిస్తే, అన్ని వర్గాల నుండి ప్రశంసలు రావటం సహజం. సొంత పార్టీలో పండగ వాతావరణం సహజమే, కానీ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత గెలవటం ఇప్పుడు తెరాసకు వ్యతిరేకత తెచ్చి పెడుతుంది. ఈ ఎన్నికల్లో కవిత భారీ మెజారిటీతో తిరుగులేని విజయం సాధించిన కానీ సొంత పార్టీ నేతలే దానిని సెలెబ్రేట్ చేసుకొని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం గత ఎన్నికల్లో కవిత ఓడిపోతే, ఆమెని మళ్ళీ తీసుకోని వచ్చి బలవంతంగా ప్రజల మీద మరోసారి రుద్దారంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున్న ట్రోల్స్ నడుస్తున్నాయి.
మాములుగా అయితే దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోరు, కానీ గతంలో కేటీఆర్ మాట్లాడుతూ ఒక చోట ఎన్నికల్లో ఓడిపోయారంటే జనాలు వాళ్ళని ఇష్టపడకపోవటమే, అలాంటిది ఇప్పుడు మరో చోట పోటీ చేయటం అంటే ఆ జనాల తీర్పు కి విలువలేనట్లే కదా..? తెలంగాణ ప్రజలు మరి అంత తెలివి తక్కువొళ్ళు లాగా కనిపిస్తున్నారా అంటూ గతంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోవటంతో ఎంపీ గా మల్కాజ్ గిరి నుండి పోటీ చేస్తున్న సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సరిగ్గా ఇప్పుడు వాటినే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ, మరి ఇప్పుడు మీరు చేసిన పనేంటి అంటూ కేటీఆర్ నే ట్యాగ్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
ఎంట్రెన్స్ పరీక్షలో ఫెయిల్ అయితే, వాళ్ళ నాన్న గారు మేనేజిమెంట్ కోటాలో సీట్ ఇప్పించాడంటూ సోషల్ మీడియాలో కేసీఆర్ ను కూడా ఒక రేంజులో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల విషయంలో ప్రతిపక్షాలు సైలెంట్ గా ఉంటే వాటి బాధ్యతను సోషల్ మీడియా వేదికగా కామన్ మన్స్ తీసుకోని ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. కేటీఆర్ చెప్పే మాటలు పక్క వాళ్ళ కోసమే కానీ, తమ వాళ్ళకి వర్తించవా..? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ ది కుటుంబ పాలనా అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు వాటికీ ఆజ్యం పోసినట్లు ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబానికి ఇచ్చేసి, కేసీఆర్ ఎంచక్కా ఢిల్లీ వెళ్ళిపోతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.