కన్నీళ్లకే కన్నీళ్లు వచ్చే కష్టానికే కష్టం వచ్చే అన్నట్లు తయారైంది కాకినాడ మేయర్ పరిస్థితి. ఈ ప్రథమ పౌరురాలి కష్టాలు చూస్తే అయ్యో పాపం అని అంటారు అంతా. పిలవని చుట్టాల్లా సమస్యలన్నీ ఆమెనే చుట్టుముట్టేశాయి. సొంతపార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఎవరు అధికారంలో ఉన్నా ఆమె పడరాని పాట్లు పడుతున్నారు. దీంతో మరో దిక్కులేక న్యాయం చెయ్యాలంటూ కోర్టు మెట్లెక్కారట.
తెలుగుదేశానికి చెందిన సుంకర పావని కాకినాడ మేయర్ అయ్యారు. ఏ ముహూర్తాన మేయర్ అయ్యిందో కాని అప్పటి నుంచి అన్నీ కష్టాలే ఆమెకు. సొంత పార్టీ కార్పొరేటర్లే తిరుగుబాటు ధోరణితో ఆమెను నిత్యం ఏడ్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు వాళ్లకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం తోడవ్వడంతో కష్టాలు కోటి రెట్లు పెరిగిపోయాయి. అటు అధికారులు లెక్కచేయరు ఇటు కార్పోరేటర్లు పట్టించుకోరు. అందర్ని బతిమిలాడుకోవాల్సి వస్తోంది ఆమెకు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెను మేయర్ గా ప్రకటించడంలో అప్పుడు ఆయన మాటకు ఎవరు ఎదురు చెప్పలేకపోయారు. కాని ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమెను నానా కష్టాలు పడుతున్నారు. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినప్పుడు తప్ప, ఆమెకు మేయర్ గా ఎవరు గుర్తించడం లేదనే టాక్ జోరుగా వినబడుతోంది. కనీసం ప్రోటోకాల్ కూడా సరిగ్గా దక్కడం లేదంట.
ఇక వైసీపీ అధికారంలోకి రాగానే కౌన్సిల్ హాల్ కు పక్కనే ఉన్న మేయర్ చాంబర్‌ను అక్కడి నుంచి దూరంగా మార్చేశారు. ఆమె ఎదురు తిరగకుండా ఉండేందుకు ఆ హాలును మహిళా కార్పొరేటర్లకు వెయిటింగ్ హాల్‌గా మార్చేశారు. ఇక మేయర్ చాంబర్‌కు అనుసంధానంగా ఉండే అంతరంగిక గదిని కేటాయించలేదు. ఎక్స్ అఫిషియో సభ్యులకు సైతం కార్పోరేషన్ కార్యాలయంలో ప్రత్యేక చాంబర్‌ను నిర్మించిన అధికారులు, తనకు మాత్రం తగిన ఏర్పాట్లు చేయలేదు. దీంతో కాకినాడ మేయర్ సుంకర పావని న్యాయస్ధానాన్ని ఆశ్రయించారని సమాచారం. తనకు ప్రొటోకాల్ ప్రకారం దక్కాల్సిన మర్యాదలను కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారని సమాచారం.