క‌డ‌ప జిల్లాకీ తాళం..బ‌య‌ట తిరిగితే అక్క‌డికే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం దేశంలో అత్య‌ధిక క‌రోనా కేసులు ఉన్న రాష్ర్టాల్లో ఏపీది నాల్గ‌వ స్థానం. మరో ఐదారు రోజుల్లో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీని దాటేస్తోందని వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. దేశంలో రెండో స్థానంలో ఉన్న తమిళనాడుతో సమానంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అదే జ‌రిగితే ప్ర‌భుత్వాలు చేసేది కూడా లేదు. ఇప్ప‌టికే స‌మూహ వ్యాప్తి ద‌శ మొద‌లైందా? అన్న అనుమానాలు బ‌లంగా వ్య‌క్తం అవుతున్నాయి. కేసుల సంఖ్య‌, స‌ర్వే నివేదిక‌లు ప‌రిశీలిస్తుంటే ఏపీ అత్యంత ప్ర‌మాద‌క‌ర స్థితిలో ఉంద‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌భుత్వం చేయాల్సింద‌ల్లా ఓ ప‌క్కా చేస్తూనే ఉంది.

కేసులు ఎక్కువ‌గా ఉన్న జిల్లాల్లో నిత్యావ‌స‌ర స‌రుకులు కొనుగోళ్ల‌కు కేవ‌లం ఐదు గంట‌లు స‌మయం మాత్ర‌మే అనుమ‌తి స్తున్నారు. ఉద‌యం ఆరు గంట‌ల నుంచి 11 గంట‌ల‌లో ఇంటి అవ‌స‌రాల‌కు అస‌ర‌మైన వాటిని కొనుక్కుని వెళ్లాల్సిందిగా చెబుతున్నారు. ఐదు గంట‌లు స‌మయం అని ప్ర‌భుత్వం చెప్పినా గంట ముందుగానే పోలీసులు దుకాణాలు అన్నింటిని ముయించేస్తున్నారు. అనంత‌పురం, క‌ర్నూలు, శ్రీకాకుళం, త‌ర్పుగోదావరి స‌హా ప‌లు జిల్లాల్లో ఇప్పుడు అవే నిబంధ‌న‌లున్నాయి. తాజాగా సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప కూడా అదే జోన్ లో ఉంది.

న‌గ‌రంలో కూడా కేసులు రోజు రోజుకి పెరిగిపోతుండ‌టంతో సోమ‌వారం నుంచి అన్ని ర‌కాల దుకాణాలు, మాల్స్, హోట‌ల్స్ , ఫంక్ష‌న్ హాల్స్ ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 ల వ‌ర‌కూ అనుమ‌తిస్తున్న‌ట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన‌వ‌స‌రంగా ప్ర‌జ‌లెవ‌రు బ‌ట‌య తిర‌గ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. కావాల్సిన వ‌స్తువులు ఇచ్చిన స‌మ‌యంలో కొనుక్కుని నేరుగా ఇంటికే వెళ్లాల‌ని తెలిపారు. బ‌య‌ట‌కు వ‌స్తే విధిగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని సూచించారు. జిల్లా ప్ర‌జ‌లంతా పోలీసుల‌కు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని కోరారు. ప్ర‌భుత్వం ఇచ్చిన స‌మయం దాటిన త‌ర్వాత అన‌వ‌స‌రంగా రోడ్ల మీద మీటింగ్ లు పెడితే క్వారంటైన్ కి త‌ర‌లిస్తామ‌ని హెచ్చ‌రించారు.