Etela Rajender : కబ్జాకోరు ఈటెల రాజేందర్.. కేసీయార్ ఎటాక్ మళ్ళీ మొదలైంది.!

Etela Rajender : తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు వెళితే గడ్డి పోచతో సమానం.. అన్నట్టుగా ఈటెల రాజేందర్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తేలిక భావం ప్రదర్శించారు. కానీ, కేసీయార్ అంచనాలు తల్లకిందులైపోయాయ్. ఈటెల రాజేందర్, గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చి, బీజేపీ నుంచి గెలిచి.. కేసీయార్‌కి కంటి మీద కునుకు లేకుండా చేశారు.

అక్కడితో ఈటెల రాజేందర్ కబ్జా ఎపిసోడ్ అటకెక్కినట్లేనని అంతా అనుకున్నారు. కానీ, కేసీయార్ సర్కార్, ఆ కేసులో వేగం పెంచింది. ఈటెల రాజేందర్ కబ్జాకి పాల్పడ్డారనే విషయాన్ని నిరూపించేందుకు నానా తంటాలూ పడుతోంది. తాజాగా, ఈటెల కబ్జా నిజమేనంటూ కలెక్టర్ స్పష్టమైన వివరణ ఇచ్చేశారు. దాంతో, ఈటెల రాజేందర్‌కి చెందిన జమున హేచరీస్ భవిష్యత్తేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

కాగా, బీజేపీలో చేరే ముందు తనకు, తనకి చెందిన జమున హేచరీస్‌కీ పూర్తి రక్షణ కల్పించేలా హామీ పొందాకనే ఈటెల రాజేందర్, రాజకీయంగా కీలకమైన ముందడుగు వేశారన్న ప్రచారం జరుగుతోంది. సో, జమున హేచరీస్ విషయంలో ఈటెలకు బీజేపీ అండగా వుండబోతోందన్నమాట.

కాగా, జమున హేచరీస్ ఎలాంటి కబ్జాలకూ పాల్పడలేదన్నది ఈటెల రాజేందర్ వాదన. కానీ, ఈటెలకి చెందిన జమున హేచరీస్, అసైన్డ్ భూముల్ని ఆక్రమించి నిర్మించబడిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్ళిన దరిమిలా, రానున్న రోజుల్లో ఈ వివాదం ఆసక్తికరమైన మలుపులు తిరగబోతోందన్నది నిర్వివాదాంశం.

‘ఈసారి ఈటెల తప్పించుకునే ప్రసక్తే లేదు..’ అని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంటే, ‘ఈటెల మీద చెయ్యేస్తే.. తెలంగాణ భగ్గుమంటుంది..’ అన్న చర్చ కాషాయ వర్గాల్లో జరుగుతోంది.