జస్టిస్ ఫర్ చైత్ర: మృగాడు చచ్చాక కూడా ఈ రగడ ఎందుకు.?

చిన్నారి చైత్రపై హత్యాయత్నం ఘటనలో నిందితుడు రాజు చచ్చాడు. ఆత్మహత్య చేసుకున్నాడో.. ఇంకేమన్నా జరిగిందోగానీ.. రైలు పట్టాలపై కుక్కచావు చచ్చిన స్థితిలో అతని మృతదేహం పడి వుంది. అయితే, చనిపోయింది మృగాడు రాజు అవునా.? కాదా.? అన్నదానిపై చిన్నారి చైత్ర కుటుంబ సభ్యులకు అనుమానాలున్నాయి. డీఎన్ఏ టెస్టులు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు, రాజు మృతదేహాన్ని తమ వద్దకు తీసుకురావాలంటున్నారు. మరోపక్క, అప్పటికప్పుడు ఈ ఘటనపై హంగామా చేసి, అంతలోనే మృగాడు రాజు చచ్చాడంటూ పోలీసులు ప్రకటించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ అంతటా జల్లెడ పట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన పోలీసులు సమాయత్తమవడం, తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో.. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడనే వాదన వినిపిస్తోంది. ఎలాగైతేనేం, వాడు చచ్చాడు.. అన్న చర్చ తెలంగాణలో జోరుగా సాగుతోంది. చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి కలుగుతుందనే భావన అందరిలోనూ నెలకొంది. కాగా, తెలంగాణ పోలీసులు చేయలేని పని.. దేవుడు చేశాడంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే, తెలంగాణ ప్రభుత్వం, చైత్ర కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించిన విషయం విదితమే. దాన్ని చైత్ర కుటుంబం తిరస్కరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంకోపక్క తమ కుటుంబం మొత్తాన్నీ పోలీసులు, చైత్ర మరణించిన రోజే అదుపులోకి తీసుకున్నారంటూ నిందితుడు రాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండడం కొసమెరు.