తెలంగాణలో కలకలం రేపిన సైదాబాద్ చిన్నారి చైత్య హత్యాచారం ఘటనలో నిందితుడు రాజు కథ ముగిసింది. ఈ రోజు ఉదయం కిల్లర్ రాజు మృతదేహం రైల్వే ట్రాక్ మీద లభ్యమైంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీయార్ ధృవీకరించారు. కిల్లర్ రాజు మృతదేహాన్ని రైల్వే ట్రాక్ మీద గుర్తించామంటూ డీజీపీ తనకు సమాచారం ఇచ్చినట్లు మంత్రి కేటీయార్ పేర్కొన్నారు. తెలంగాణతోపాటు, దేశవ్యాప్తంగా చిన్నారి చైత్రపై హత్యాచారం ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తొలుత వేగంగా స్పందించలేదన్న విమర్శలొచ్చాయి. నిజానికి, మీడియా కూడా ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించిందనే చెప్పాలి. నిందితుడు రాజు, చిన్నారిపై అఘాయిత్యం చేశాక.. పారిపోయాడు. అతన్ని పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణ అంతటా జల్లెడపట్టారు. ఈ క్రమంలోనే రాజు మృతదేహం రైలు పట్టాలపై దొరికింది.
రాజు మృతదేహాన్ని వరంగల్ జిల్లాలో గుర్తించారు. అతన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రాజు చేతిపై వున్న పచ్చబొట్టు ఆధారంగా అతన్ని గుర్తించారు. కాగా, గతంలో దిశ ఘటనలో పోలీసులు, నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసిన విషయం విదితమే. చిన్నారి చైత్యపై హత్యాచారం ఘటనలోనూ నిందితుడికి అదే శిక్ష విధించాలనే డిమాండ్ పౌర సమాజం నుంచి వచ్చింది. ‘ప్రతి ఎన్‌కౌంటర్ బుల్లెట్ ద్వారానే జరగాలని ఏమీ లేదు..’ అంటూ కిల్లర్ రాజు మృతి ఘటనపై సోషల్ మీడియాలో కామెంట్స్ పోటెత్తుతున్నాయ్. మొత్తమ్మీద, చిన్నారి చైత్రపై అఘాయిత్యం ఘటనలో న్యాయం జరిగిందనే భావించాలేమో. బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించడం గమనార్హం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ప్రజా సంఘాలు.. బాధిత కుటుంబాన్ని పరామర్శించాయి.