ఓ చిన్నారి అత్యంత దారుణంగా హత్యాచారానికి గురైంది భాగ్యనగరం హైద్రాబాద్‌లో. ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పలువురు రాజకీయ నాయకులు, బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు, మృగాడ్ని కఠినంగా శిక్షించాలని నినదిస్తున్నారు. ‘దిశ’ ఘటనలో జరిగినట్లుగా చిన్నారి చైత్ర విషయంలోనూ మృగాడికి తక్షణ మరణ శిక్ష విధించి తీరాలన్న డిమాండ్ తెరపైకొస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే, పవన్ కళ్యాణ్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్‌కి లక్షలాదిమంది అభిమానులున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, అభిమాన సంద్రమే కనిపిస్తుంది. కానీ, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు కేవలం సినీ నటుడు మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడు కూడా.
ఓ రాజకీయ పార్టీకి అధినేత ఆయన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఓ సున్నితమైన అంశం నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు అభిమానులు సంయమనం పాటించకపోతే ఎలా.? మొబైల్ ఫోన్లలో పవన్ కళ్యాణ్ పర్యటనను చిత్రీకరించేందుకు అభిమానులు పోటీ పడ్డారు. కేవలం అభిమానులే కాదు, ఇతరులూ పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే ప్రవర్తనతో కనిపించారు. ఈ మొత్తం తతంగం పట్ల పవన్ కళ్యాణ్ ఒకింత అసహనానికి గురయ్యారు. కారు దిగి ముందుకు వెళ్ళలేని పరిస్థితి పవన్ కళ్యాణ్‌ది. బాధిత కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఓదార్చారు.. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. మృగాడ్ని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మీడియా, ఇతరత్రా అంశాల మీద ఫోకస్ పెట్టడం కంటే, ఇలాంటి విషయాల్ని వెలుగులోకి తీసుకురావాలని సూచించారు పవన్ కళ్యాణ్.