ప్రస్తుత కాలంలో భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోతోంది. భార్య భర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ సర్దుకుపోయేవారు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న గొడవలు కూడా పెద్దగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఎంతో మంది దంపతులు ఒకరితో ఒకరు కలిసి ఉండలేక విడాకుల తీసుకుంటుంటే మరి కొంతమంది మాత్రం దారుణంగా హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల కర్ణాటకలో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల విడాకుల కేసు కోర్టులో ఉండగానే భర్త భార్యను కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు.
వివరాలలోకి వెళితే… తట్టెకెరే ప్రాంతంలో నివాసం ఉంటున్న శివకుమార్, చైత్ర దంపతులకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే గత మూడు సంవత్సరాలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణం ఒకరికొకరు దూరంగా ఉంటూ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో చైత్ర తన భర్త నుండి భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో శనివారం హోలెనరసిపుర కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ‘లోక్ అదాలత్’లో భార్యాభర్తలు కలిసి ఉండాలని చైత్ర, శివకుమార్‌కు న్యాయమూర్తి సూచించారు. అయినప్పటికీ భార్యాభర్తలిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు.
శనివారం కోర్టుకు హాజరైన చైత్ర తన కూతురిని టాయ్‌లెట్‌కు తీసుకెళ్లింది. ఈ క్రమంలో శివకుమార్ ఆమెను వెంబడించి తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా చైత్ర గొంతు కోసి అక్కడి నుండి పారిపోవటానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు శివకుమార్ ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కత్తితో గొంతు కోవటంతో చైత్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో పోలీసులు వెంటనే ఆమెని హోలెనరసిపుర హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హసన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన కొన్ని నిమిషాలలోనే చరిత్ర ప్రాణాలు కోల్పోయింది. కోర్టు ప్రాంగణంలోనే విచక్షణ రహితంగా భార్యపై కత్తితో దాడి చేయడంతో శివకుమార్ మీద పోలీసులు కేసు నమోదు చేసి అతనిని రిమాండ్ కి తరలించారు.