Judicial Capital In Kurnool : ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ కొనసాగే అవకాశం కనిపించడంలేదు. కానీ, ఆయన కర్నూలులోనే న్యాయ రాజధాని వుంటుందని కుండబద్దలు గొట్టేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం వైసీపీ ఇప్పటికైనా గుర్తెరుగుతుందా.? అంటే ఆ అవకాశమే లేదనిపిస్తోంది.
వైఎస్ జగన్ సర్కారు మూడు రాజధానుల చట్టాన్ని తెచ్చి, రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంకెలా న్యాయ రాజధాని సాధ్యమవుతుంది.? ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడింది. ఆ రాజధానికీ, విభజన చట్టానికీ లింకు వుంది. అబ్బే, ‘రాష్ట్ర పరిధిలోనే రాజధాని నిర్ణయమని కేంద్రం చెబుతోంది’ అన్న మాట వైసీపీ ఉపయోగిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
న్యాయ రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. ఇవన్నీ వినడానికి బావుంటాయ్. ఆచరణలో సాధ్యం కావు. న్యాయ రాజధానికి పెద్ద తతంగం వుంది. కేంద్రం సానుకూలంగా స్పందించాలి.. సుప్రీంకోర్టు కూడా స్పందించాలి. ఇవేవీ రాష్ట్ర పరిదిలోని విషయాలు కావు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం న్యాయ రాజధాని.. అంటూ చెప్పడం ఎంతవరకు సబబు.?
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఒకింత లాజికల్‌గా మాట్లాడేవారు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అధినేత మెప్పు కోసం న్యాయ రాజధాని కర్నూలులోనేనంటూ బుగ్గన చెబుతున్నారుగానీ, ఆయనకీ వాస్తవ పరిస్థితి ఏంటన్నది బాగా తెలుసు.
మూడేళ్ళ పాలనలో రాజధాని విషయమై హైడ్రామా నడపడం మినహా, రాజధాని పేరుతో వీసమెత్తు అభివృద్ధి కూడా చేయలేకపోయిన జగన్ సర్కారు, ఇప్పటికైనా.. తప్పు తెలుసుకుని, రాజధాని అమరావతిపై ఫోకస్ పెడితే మంచిది.