చెవిరెడ్డికి ఎస్.. పేర్ని నానికి నో.. ఛాన్స్ ఉందా?

ఏపీలోని చాలామంది నేతలు, మరి ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న వైఎస్సార్ సీపీలోని కొంతమంది నేతలు… జగన్ దగ్గర ఒక రిక్వస్ట్ పెట్టుకుంటున్నారంట. వచ్చే ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అవును… ఇప్పటికే ఈ విషయాన్ని బహిరంగంగా కూడా పలుసార్లు ప్రస్థావించిన కొంతమంది వైకాపా నేతలు… తమకు రెస్ట్ ఇచ్చి, తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని జగన్ ని రిక్వస్ట్ చేస్తున్నారు.

అలా వారసులకోసం రిక్వస్టులు చేస్తున్న లిస్టులో సీఎం జగన్‌ కు అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే వాళ్లు కూడా ఉన్నారు. వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు. తన కుమారుడు మోహిత్‌ ను ఆశీర్వదించాలని ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలను కోరిన చెవిరెడ్డి… తాను ఎక్కడ ఉన్నా చంద్రగిరి అభివృద్ధిని మరువనని చెబుతున్నారు. ఇంత భారీ డైలాగ్ వేయడంతో… వచ్చే ఎన్నికల్లో తన కుమారుడి రంగంలోకి దించబోతున్నారని క్లియర్‌ గా అర్థమవుతోందని అంటున్నారు.

అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్న ప్రకటనపై వైసీపీ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారసుడు మోహిత్‌ రెడ్డిని బరిలోకి దింపాలన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేక.. ఇది కేవలం చెవిరెడ్డి చేసుకుంటున్న ప్రచారం మాత్రమేనా? అని! ఎందుకంటే ఒకవేళ ఈ విషయంలో చెవిరెడ్డికి సీఎం జగన్ నుంచి అనుమతి లభిస్తే.. మరికొందరు నేతలకు కూడా దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. చెవిరెడ్డికి జగన్ “ఎస్” చెప్పారనే వార్త వెలుగులోకి రాగానే… తక్కువలో తక్కువ 15మంది ఎమ్మెల్యేలు జగన్ ముందు వాలిపోతారు!

మాజీమంత్రి పేర్ని నాని, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లు ఈ లిస్ట్ లో ముందువరుసలో ఉంటారని అంటున్నారు. వీరిద్దరూ ఇప్పటికే అదే ప్రతిపాదనను సీఎం జగన్ ముందు ఉంచారు. అయితే వీరి ప్రతిపాదనలను సీఎం జగన్ తిరస్కరించారని గతంలో వార్తలు వచ్చాయి. “మీరే పోటీ చేయాలని, మీతో నాకు చాలా కం ఫర్ట్ గా ఉందని” సీఎం జగన్ తమతో అన్నట్టు మాజీమంత్రి పేర్ని నాని అప్పట్లో కామెంట్ చేశారు. దీంతో ఒకవేళ సీఎం జగన్ చెవిరెడ్డికి వారసుడి ఎంట్రీ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మరోసారి పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనను వైసీపీ అధినేత ముందు ఉంచే అవకాశాలు లేకపోలేదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ విషయంలో ఒకరికి ఓకే చెప్పి.. మరొకరికి నో చెబితే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా… చెవిరెడ్డి రూపంలో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. మరి జగన్ ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారన్నది వేచి చూడాలి!