ఏపీలో వైఎస్ జగన్ పై ఉన్న ఫిర్యాదుల్లో… యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది ఒకటి! అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఆ గ్యాప్ ని యుటిలైజ్ చేసుకునే క్రమంలో జాబ్ మేళాను తెరపైకి తెచ్చింది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా… యువతకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పించే దిశగా అడుగులు వేస్తుంది. దీంతో… అన్ని నియోజకవర్గాల్లోనూ జాబ్ మేళాలు నిర్వహించాలని ఫిక్సయ్యింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాలో నియోజకవ వర్గాల వారీగా జాబ్ మేళా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ప్రతి నెల ఒక్కో నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్న సర్కార్… తాజాగా ఆ వివరాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా… ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించేలా రూపొందించిన క్యాలెండర్ ను నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన బుగ్గన… ప్రతి 3 నెలలకోసారి ఒక్కో జిల్లాలో ఏడాదికి 4 మెగా జాబ్ మేళాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రతి జాబ్ మేళాలో కనీసం 10 పేరున్న పరిశ్రమలు, కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం రోజులలో జాబ్ మేళా నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు.
దీంతో… ఈ ఏడాది 286 జాబ్ మేళాల ద్వారా కనీసం 30వేల మందికి ఉద్యోగాలందించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది ఏపీ సర్కార్. ఈ సందర్భంగా… సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్, పరిశ్రమలతో స్కిల్ డెవలప్ మెంట్ విభాగాన్ని అనుసంధానించాలని మంత్రి బుగ్గన, సంబంధిత అధికారులను ఆదేశించారు. మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఆటో మొబైల్, రిటైల్, ఐ.టీ, సర్వీస్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కాగా, ఈ ఏడాది 26 జిల్లాలలో నిర్వహించిన 38 జాబ్ మేళాల్లో 4,774 మంది ఉద్యోగాలు పొందినట్లు స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ఎండీ వెల్లడించిన సంగతి తెలిసిందే! ఏపీలో ఉన్న నిరుద్యోగ యువతకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి!