ముంబై:అర్నాబ్ గోస్వామి సారథ్యంలో జాతీయస్థాయిలో కొనసాగుతున్న న్యూస్ చానెల్ ‘రిపబ్లిక్ టీవీ’. ఆయన ఒక ఫైర్ బ్రాండ్,దూకుడుగానే ఉంటాడు. చర్చల్లో నేతల పంచెలు తడిసిపోయేలా ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఆయన చానెల్ లో పనిచేసే రిపోర్టర్లు అనుచితంగా ప్రవర్తిస్తుండడం విశేషం. ముంబైలో మీడియా జర్నలిస్టులు తాజాగా ఓవరాక్షన్ చేసిన రిపబ్లికన్ టీవీ జర్నలిస్టు దుమ్ము దులిపారు.
ముంబైలో ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఎన్.సీ.బీ విచారణ సాగుతోంది. ఆ న్యూస్ కవర్ చేయడానికి మిగతా చానెళ్ల రిపోర్టర్లతోపాటు రిపబ్లిక్ టీవీకి చెందిన ప్రదీప్ భండారి కూడా వచ్చాడు.
జాతీయ మీడియాలో వస్తున్న వార్తల మేరకు న్యూస్ కవర్ చేస్తున్న సమయంలో రిపబ్లిక్ టీవీ రిపోర్టర్.. మిగతా చానెల్ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారు దాడికి పాల్పడ్డారని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రిపబ్లిక్ టీవీ చానెల్ జర్నలిస్ట్ ప్రదీప్ తన చానెల్ కెమెరాను మిగతా రిపోర్టర్ల వైపు తిప్పి ‘వీళ్లు మానసిక రోగులు.. చాయ్, బిస్కెట్ల కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్లు నిజాలు చెప్పరు. మేము మాత్రమే నిజాలు చూపిస్తాం’ అని వ్యాఖ్యానించారు. దీంతో పక్కనే ఉన్న తోటి జర్నలిస్టులు ఆగ్రహానికి గురై అందరూ కలిసి రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ పై దాడి చేశారు.
పోలీసులు వచ్చి వారిని జర్నలిస్టుల దాడిని ఆపి సముదాయించి అందరినీ పక్కకు తప్పించారు.. అనంతరం ఎన్డీటీవీ, ఏబీపీ న్యూస్ చానెళ్ల గుండాలు తనపై దాడి చేశారని బాధిత రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ ప్రదీప్ ట్విట్టర్ లో ఆరోపించాడు. ఎన్డీటీవీ, ఏబీపీ న్యూస్ చానెల్స్ జర్నలిస్టులు మాత్రం ఈ దాడిని సమర్థించుకున్నారు. ప్రదీప్ ఓవరాక్షన్ కు తగిన శాస్తి జరిగిందని కౌంటర్ ఇచ్చారు.