గణేష్ నిమజ్జనం వేళ ముంబైలో ఉగ్ర బెదిరింపులు.. కోటి మంది చంపేస్తాం అని మెసేజ్..!

గణేష్ నిమజ్జనం సందర్భంగా ముంబై నగరం ఆనందోత్సాహాలతో నిండిపోవాల్సిన వేళలో.. ఉగ్రవాద బెదిరింపు వార్తతో వాతావరణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. నగరంలోని ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గురువారం రాత్రి ఒక వాట్సాప్‌ మెసేజ్‌ రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముంబైలో 34 వాహనాల్లో 400 కిలోల ఆర్డీఎక్స్‌ను అమర్చారని, ఒక కోటి మందిని చంపబోతున్నట్లు హెచ్చరించడం నగరాన్ని భయాందోళనలకు గురిచేసింది.

ముంబైలో ఇప్పటికే నిమజ్జనం కోసం లక్షలాది మంది భక్తులు తరలిరానుండగా.. అకస్మాత్తుగా వచ్చిన ఈ ఉగ్ర హెచ్చరిక పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ‘లష్కర్-ఎ-జిహాదీ’ అనే సంస్థ పేరుతో వచ్చిన సందేశం పరిస్థితిని మరింత భయంకరంగా మార్చింది. దాంతో నగరంలోని ప్రతి ప్రాంతంలో భద్రతా దళాలు మోహరించబడి, అనుమానాస్పద వాహనాలపై తనిఖీలు చేస్తున్నారు.

ఈ బెదిరింపుపై క్రైమ్ బ్రాంచ్‌ దర్యాప్తు ప్రారంభించగా, ఉగ్రవాద నిరోధక దళం (ATS), ఇతర కేంద్ర ఏజెన్సీలకు సమాచారం అందించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇప్పటికే భారీగా భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ.. ఈ మెసేజ్‌ కారణంగా పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శనివారం జరిగే భారీ నిమజ్జనాల్లో ఏ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

ప్రస్తుతం నగరంలోని బస్‌ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూంబింగ్‌ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ముంబై వాసులు పుకార్లను నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఉత్సవ వాతావరణంలో ఉగ్ర బెదిరింపులు ముంబై ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినా, పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పరిస్థితి నియంత్రణలోనే ఉందని అధికారులు చెబుతున్నారు. భక్తి, భద్రత రెండూ కలిసే ముందుకు సాగాలన్నది ఇప్పుడు ముంబై పోలీసుల ప్రధాన లక్ష్యం. మరి ఈ బెదిరింపులు ఆకతాయిల పనా.. లేక ఉగ్రవాదులే చేశారా అన్నది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.