‎OTT: ఈ హీరో కేవలం ఓటీటీకే పరిమితమా.. థియేటర్ కి ఎంట్రీ ఇవ్వడం కష్టమా?

‎‎OTT: ఈ మధ్య కాలంలో థియేటర్ కి ప్రేక్షకులు రావడం చాలా వరకు తగ్గించడంతో థియేటర్ తో పోల్చుకుంటే ఓటీటీ లోనే ఎక్కువ సినిమాలు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా గడచిన ఐదేళ్లలో ఇండియాలో ఓటీటీ మార్కెట్‌ విపరీతంగా పెరిగింది. ఏకంగా సినిమాల బడ్జెట్‌ ను ఖరారు చేయడం, హీరోల పారితోషికం మార్చడం, సినిమా స్థాయిని మార్చడంలోనూ ఓటీటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎలాగూ ఓటీటీ డబ్బు భారీగా వచ్చి పడుతుంది. కాబట్టి మేకింగ్‌ కి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా స్టార్స్‌ పారితోషికం కూడా పెంచేస్తున్నారు.

‎ఇదే సమయంలో సినిమా థియేట్రికల్‌ రిలీజ్ పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. ఒకప్పుడు స్టార్‌ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అన్నీ థియేటర్‌లలో వారాల కొద్ది ఆడేవి. కాని ఇప్పుడు దాదాపు అన్ని సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కనుక థియేట్రికల్‌ రెవిన్యూ పై పెద్ద ప్రభావం కనిపిస్తుంది. సినిమాలు సూపర్‌ హిట్ అయితే పర్వాలేదు కానీ యావరేజ్‌గా నిలిచినా, ఫ్లాప్‌ అయినా థియేట్రికల్‌ రెవిన్యూ కనీసం 25 శాతం కూడా రావడం లేదు. చిన్న హీరోల సినిమాలు కనీసం పబ్లిసిటీ ఖర్చులకు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టలేక పోతున్నాయి. అందుకే థియేట్రికల్‌ రిలీజ్‌ కు వెళ్లకుండా చాలా మంది హీరోల సినిమాలను డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా తీసుకు వస్తున్నారు.

‎ సౌత్‌ లో కాస్త తక్కువ అయినా నార్త్‌ లో పెద్ద సినిమాలు సైతం ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. ఒక మోస్తరు క్రేజ్‌ ఉన్న హీరోల సినిమాలను థియేట్రికల్‌ రిలీజ్‌ చేయడం కంటే ఓటీటీ ద్వారా డైరెక్ట్‌ స్ట్రీమింగ్‌ చేయడం మంచి పని అనే అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. కాగా బాలీవుడ్‌ లో ఉన్న స్టార్స్‌లో జాన్‌ అబ్రహం కూడా ఒకరు. ఈయన ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించాడు. కానీ ఇప్పుడు ఈయన సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్‌ చేయడానికి బయ్యర్లు ముందుకు రాని పరిస్థితి. చాలా మంది స్టార్‌ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ గా నిలుస్తున్న నేపథ్యంలో జాన్ అబ్రహం తాజా చిత్రం టెహ్రాన్‌ మూవీను థియేటర్‌ రిలీజ్‌ చేయడానికి బయ్యర్లు సిద్ధంగా లేరు. దాంతో జాన్‌ అబ్రహం స్వయంగా నిర్మించిన ఈ సినిమాను డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే జాన్‌ అబ్రహం వంటి స్టార్‌ నటుడి సినిమా ఇలా డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా వస్తుండటంతో ఇక మీదట కూడా మరిన్ని సినిమాలు, డైరెక్ట్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావాల్సి ఉంటుందేమో అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.