అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేకానేక వివాదాస్పద నిర్ణయాలను ఒక్కొక్కటిగా కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్. అమెరికన్ల ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపిస్తుందనే కారణంతో వలసదారులు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధిస్తూ అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆదేశాలను బైడెన్ ఉపసంహరించుకొన్నారు.
ఏటా అమెరికా సుమారుగా 1.1 మిలియన్ల గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది. గ్రీన్ కార్డులు ఉంటే ఇతర దేశాలకు చెందినవారు జీవిత కాలం పాటు అమెరికాలో నివసించేందుకు, ఉద్యోగం చేయవచ్చు. ఐదేళ్లలో పౌరసత్వం పొందే అవకాశం కూడా కలుగుతుంది. అయితే, గ్రీన్ కార్డులను ‘బిల్డ్ అమెరికా’ వీసాలతో భర్తీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి కలకలం రేపారు. ‘వలసదారులు రావాలని కోరుకుంటున్నాం. కానీ ఈ వలసదారుల్లో ఎక్కువ భాగం తమ ప్రతిభ, నైపుణ్యాల ద్వారా రావాల్సి ఉంటుంది. ప్రపంచంలో మీరెక్కడ పుట్టారు? మీ బంధువులెవరు? అనేవి కాకుండా మీరు అమెరికా పౌరుడు కావాలంటే మేం కోరుకుంటున్న ప్రమాణాలను మీరు సాధించాలి. దీనివల్ల మా దేశంలో వలసల్లో వైవిధ్యం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డ్ కేటగిరీలను కొత్త వీసాతో భర్తీ చేస్తాం. అది బిల్డ్ అమెరికా వీసా’ అని తెలిపారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం గ్రీన్‌కార్డ్ లాటరీ ప్రొగ్రామ్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఈ కార్యక్రమం కింద అమెరికా ఏటా 55వేల మందికి గ్రీన్‌కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 5లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు ఆ ఆదేశాలను ఉపసంహించారు.ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతుల్ని.. అమెరికాకు రాకుండా ఇది నిలువరిస్తోందన్నారు. అందుకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు. బైడెన్ నిర్ణయంపై గ్రీన్‌కార్డ్ లాటరీ విజేతలు, వీసా దరఖాస్తు దారులు సంతోషంగా ఉన్నారు. మొత్తంగా ఇది చాలా మందికి శుభవార్తగా భావిస్తున్నారు. అందులో సహజంగానే మెజార్టీ ఇండియన్లు.