తండ్రి విలువలు జగన్ అలవరచుకున్నారు .. జేసీ ప్రభాకర్‌రెడ్డి

టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మున్సిపల్‌ చైర్మన్‌ కావడానికి జగన్‌ హెల్ప్‌ చేశాడన్నారు. జగన్‌ తలుచుకుని ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో..తాను మున్సిపల్ చైర్మన్‌ అయ్యే పరిస్థితి లేదన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం సీఎం జగన్‌, మంత్రి బొత్స సత్యనారాయణను కలుస్తానని తెలిపారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి లేఖలు రాస్తానని పేర్కొన్నారు.

కాగా టెన్షన్‌ వాతావరణం నడుమ చైర్మన్‌గా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికవగా వైస్ చైర్మన్‌గా సరస్వతి ఎన్నికయ్యారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతివ్వడంతో ప్రభాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓట్లను మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన నాటి నుంచి ఈ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు శిబిరాలను సైతం ఏర్పాటు చేశాయి. మొత్తానికి జేసీ ఎన్నికతో ఉత్కంఠకు తెరపడింది. చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాడిపత్రిలో రౌడీయిజం… గుండాయిజం ఇక ఉండదన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సత్తా చాటినా… తాడిపత్రిలో మాత్రం జేసీ సోదరులు తమ ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీకి అతీతంగా తమ సొంత ప్రాబల్యంతో మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసించారు. ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి లాగానే జగన్ లో కూడా విలువలు ఉన్నాయని చెప్పారు. ఈరోజు ఆ విషయాన్ని తాను స్పష్టంగా గమనించానని అన్నారు.