జనసేనాని పవన్ మళ్ళీ సైలెంటయ్యారెందుకని.?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వెళ్ళారు. దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ముఖ్య నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించీ చర్చించారు అమిత్ షా. ఇంతకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ.?
బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో.. పెద్దగా సందడి చేయలేదు.

అమిత్ షాతో జనసేన అధినేత పవన్ గనుక భేటీ అయి వుంటే, పొలిటికల్ ఈక్వేషన్ ఇంకోలా వుండేది. పైగా, అమిత్ షా.. అమరావతి గురించి ఆరా తీశారనే ప్రచారం జరుగుతోంది. ఆ అమరావతి విషయంలో ఏపీ బీజేపీ – జనసేన మధ్య చిన్నపాటి గందరగోళం వుంది. ఆ గందరగోళం పవన్ – అమిత్ షా భేటీతో తొలగిపోయేదే.

ఇదిలా వుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ‘అమ్మ ఒడి.. అమ్మకానికి బడి..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా వేసిన ట్వీట్ల పరంపర రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

బీజేపీ – జనసేన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిత్రపక్షాలే అయినా, ఇరు పార్టీల మధ్యా సఖ్యత కొరవడింది. అంశాల వారీగా ప్రభుత్వమ్మీద రెండు పార్టీలూ కలిసి ఉమ్మడి పోరాటం చేయాల్సి వుంది. కానీ, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే క్రమంలో బీజేపీ, జనసేన.. చెరోదారి అయిపోతున్నాయి.

తనకు బీజేపీ జాతీయ నాయకత్వంతో మంచి సంబంధాలున్నాయని పదే పదే చెప్పుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడు.. వారిని కలిసేందుకు ప్రయత్నించడంలేదెందుకు.? అన్న ప్రశ్న ప్రతిసారీ ఉత్పన్నమవుతోంది.