ఏపీ లో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు ఒక ఎత్తు.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లు ఒక ఎత్తు అనే రేంజిలో ఉంది ఫైటింగ్. విజయవాడ కార్పొరేషన్లో అటు ఆధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. మధ్యలో జనసేన-బీజేపీ కూడా తమ ప్రభావాన్నిచూపించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని డివిజన్లలోనూ పోటీ చేశాయి. దీంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఏ పార్టీది అనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. గెలుపుపై వైసీపీ నమ్మకంతో ఉంది.
టీడీపీ అయితే తామే గెలుస్తామని, వైసీపీకి అంత సీన్ లేదని స్పష్చం చేస్తుండగా, జనసేన కూడా మేయర్ పీఠం తమదేనని చెప్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో లెక్క వేరు. ఇప్పటి లెక్కవేరని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. విజయవాడ నగరంలో జనసేన ప్రభావంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కృష్ణలంక, సింగ్ నగర్, పటమటతో పాటు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని డివిజన్లలో జనసేనకు ఓట్లు బాగానే పోలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన మొత్తం 40 డివిజన్లలో పోటీ చేసింది.
బీజేపీ 22 డివిజన్లలో బరిలో దిగగా ఒక డివిజన్లో టీడీపీ, జనసేనకు మద్దతిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో జనసేనకు ఓట్లు బాగానే వచ్చాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రభావం తాము చూపిస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. జనసేన గెలిచే డివిజన్లపై పెద్దగా అంచనాలు లేకపోయినా, విజేతను నిర్ణయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీడీపీకి బదులు జనసేన ఖాతాలో అలాగే టీడీపీని వ్యతిరేకించే ఓట్లు కూడా ఆ పార్టీకే పడినట్లు చర్చ జరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయావకాశాలను జనసేన బాగా గెబ్బకొట్టింది. దాదాపు 40 నియోజకవర్గాల్లో జనసేన వల్ల వైసీపీకి ప్లస్ అయింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2019 సీన్ రిపీట్ అయితే మాత్రం టీడీపీకి ఇక్కడ భారీ నష్టం తప్పదని భావిస్తున్నారు. ఎందుకంటే రాజధాని తరలింపు దృష్ట్యా వైసీపీ, టీడీపీలు విజయవాడను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడు రాజధానులకు ఇది రిఫరెండంగా కూడా భావిస్తున్నాయి.