తిరుపతి ఉఫ ఎన్నిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతాయనీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమవుతుందనీ, తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కోల్పోతుందనీ భారతీయ జనతా పార్టీ నానా హంగామా చేసింది. వాస్తవానికి, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికని బీజేపీ అధిష్టానం లైట్ తీసుకుంది. అందుకే, ఆ ఉప ఎన్నిక ప్రచారం కోసం రావాల్సిన జాతీయ స్థాయి ముఖ్య నేతలు రాలేదన్న విమర్శ వుంది. మూడో స్థానానికి బీజేపీ పరిమితమైపోతుందని అందరికీ తెలుసు. కానీ, కాస్తో కూస్తో ఉనికి చాటుకుందామనుకున్న బీజేపీ, పూర్తిగా చతికిలపడింది. ‘ఇది మనకి అగ్ని పరీక్ష. బీజేపీ – జనసేన మధ్య సఖ్యతకు ఇదొక కొలమానం..’ అంటూ జనసేన కూడా, తిరుపతి ఉప ఎన్నిక ముందు మిత్రపక్షానికి సహకరించే విషయమై జనసైనికులకు స్పష్టమైన సూచనలు చేసింది.
ఆ సూచనలు కొంతవరకు మాత్రమే పనిచేశాయి. బీజేపీ.. చెయ్యాల్సిన స్థాయిలో అధికార వైసీపీ మీద ఫైట్ చేయలేకపోయింది. దాంతో, ఫలితం.. బీజేపీనే కాదు, జనసేనను కూడా ఇబ్బంది పెట్టేలా వచ్చింది. ఆ తర్వాత కూడా బీజేపీ, ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్నీ వైసీపీ మీద చేయాల్సిన స్థాయిలో ఘాటుగా చేయలేకపోవడాన్ని మిత్రపక్షం జనసేన జీర్ణించుకోలేకపోతోంది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, కీలకమైన సందర్భాల్లో వైసీపీని నిలదీయాల్సింది పోయి, తెరవెనుకాల వైసీపీకి సహకరించడం జనసేనకు ఇబ్బందికరంగా మారుతోంది. అయితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలేమీ లేవు గనుక.. బీజేపీతో జనసేన తెగతెంపులు చేసుకోవడానికి మరింత సమయం పట్టొచ్చు. కానీ, తెగతెంపులు తప్పేలా లేవు. పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కాబోతున్నారన్న ప్రచారం కూడా బీజేపీ లీకుల సారాంశమేనని జనసేన గట్టిగా నమ్ముతోందట.