Ambati Rambabu : అంబటి రాంబాబు పేరుకే వైసీపీ ఎమ్మెల్యే కానీ.. పార్టీలో ఆయనకు ఉన్న పలుకుబడి, ప్రాధాన్యత మామూల్ది కాదు. అందుకే.. ఆయన ప్రతిపక్షాలపై కాస్త ఘాటుగానే స్పందిస్తుంటారు. టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఏమాత్రం ఆలోచించకుండా దూకుడే. ప్రతిపక్షాలు కూడా అంబటిని వదిలిపెట్టవు. ఓ రేంజ్ లో అంబటిపై విమర్శలు గుప్పిస్తాయి.
అయితే.. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అంబటి రాంబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాటిపై జనసేన కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంబటి రాంబాబుపై తీవ్రస్థాయిలో జనసైనికులు విరుచుకుపడుతున్నారు.
అసలు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి అంబటి రాంబాబుకు ఉందా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందు స్పందించిందే పవన్ కళ్యాణ్ అంటూ అంబటిపై ట్వీట్ల దాడి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్.. ఢిల్లీకి వెళ్లినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యతను, దాని కోసం ఎంతో మంది ఆంధ్రులు చేసిన పోరాటం, ప్రాణత్యాగాలు.. అన్నింటినీ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించి… స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయొద్దంటూ పవన్.. కేంద్రానికి సూచించారంటూ జనసైనికులు చెబుతున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం చేయలేక చేతులెత్తేసింది. మీకు చేతకాదు.. చేసే వాళ్లను చేయనీయరు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడే వాళ్ల మీద విమర్శలు గుప్పిస్తారా? అంటూ అంబటిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ మీద అసత్య ఆరోపణలు చేస్తే మీకు వచ్చేదేం ఉండదు అంబటి. నీకు జగన్ ఇప్పటి వరకు ఏ పదవి ఇవ్వలేదని.. మా నాయకుడి మీద పడి ఏడ్వకు. మరోసారి మా నాయకుడిపై ఏదైనా అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదంటూ జనసేన కార్యకర్తలు తీవ్రస్థాయిలో అంబటిని హెచ్చరించారు.