దేశంలో ఎక్కడా లేని విధంగా పక్షపాత మీడియా మన ఆంధ్రాలో వేళ్లూనుకుని ఉంది. 24 గంటలు ఒకరి కొమ్ముకాస్తూ అవతలివారి మీద ఉన్నవి లేనివి కల్పించి రాస్తూ బురద చల్లడమే ఈ పక్షపాత మీడియా ప్రధాన లక్ష్యం. తమ రాజకీయ పార్టీలకు ఎవరైనా అడ్డుతగులుతున్నారు అంటే వారిని లక్ష్యంగా చేసుకుని వారి మీద దాడి చేస్తూ ఉంటాయి ఈ పత్రికలు. మన రాష్ట్రంలోని ప్రధాన పత్రికలు ఏయే పార్టీలకు పనిచేస్తున్నాయో అందరికీ తెలుసు. సాక్షి వైసీపీ కోసం పనిచేస్తుంటే ఆంధ్రజ్యోతి టీడీపీని వెనకేసుకొస్తుంది. ఈ వాస్తవాన్ని నిస్సంకోచంగా, నిర్భయంగా మాట్లాడవచ్చు. అయితే తమ పార్టీలకు, నాయకులకు తగ్గట్టు ఆయా పత్రికలు నడుచుకోవడంలో తప్పులేదు కానీ వేరొకరి మీద అనవసరంగా, నిరాధారంగా తప్పుడు కథనాలు, ఆరోపణలు చేయడమే దారుణమైన విషయం.
ఇన్నాళ్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఈ పనిని చేస్తూ వచ్చింది. చంద్రబాబు చర్యలను, బాబుగారి గత పాలనను పొగిడే ఈ దినపత్రిక దినమంతా వైఎస్ జగన్ మీద, వైసీపీ మీద ఆరోపణలు, అవినీతి కథనాలు వండివాడ్చేది. వాటిలో అనేకం నిరాధారమైనవి, అనవసరమైనవే ఉండేవి. ఆంధ్రజ్యోతి చేసే ఆ పనిని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించేవి. జగన్ అనుకూల మీడియా బాబు మీద ప్రతిదాడి చేసేది. ఇప్పుడు అదే పనిని ఆంధ్రజ్యోతి కంటే సాక్షి ఎక్కువగా చేస్తోంది. అది కూడ పవన్ కళ్యాణ్ మీద కావడం గమనార్హం. చాలా విషయాల్లో ఉద్దేశ్యపూర్వకంగానే పవన్, జనసేనలను పక్కనపెట్టే సాక్షి ఆరోపణలు చేయడంలో మాత్రం ముందుంటోంది.
తాజాగా నూతన్ నాయుడు, ఆయన భార్య మీద ఒక దళిత యువకుడిని అవమానకర రీతిలో శిరోముండనం చేసిన ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధిత యువకుడి పిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడ దొరికింది. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే సాక్షి మీడియా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని నూతన్ నాయుడు అంటూ, పరాన్నజీవి చిత్ర దర్శకుడు అంటూవార్తలను ప్రచురించింది. అంటే నూతన్ నాయుడును జనసేనకు అంటగట్టే ప్రయత్నం ఇది. దీన్ని గమనించిన జనసేన కార్యకర్తలు అసలు నూతన్ నాయుడుకు, జనసేనకు లింక్ ఏమిటి. కనీసం అతను అధికారికంగా పార్టీ కార్యకర్త కూడ కాదు అంటూ విరుచుకుపడుతున్నారు.
అంతేనా గతంలో నూతన్ నాయుడు తాను వైసీపీ రాజ్యాంగం, విధివిధానాలు రూపొందించడంలో కృషి చేశానని, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామక్రిష్ణా రెడ్డి లాంటి వారి తన కృషిని గౌరవించి, అభినందించారని అంటూ మాట్లాడిన వీడియోను బయటకు లాగి ఇప్పుడు చెప్పండి ఇతను వైసీపీ కార్యకర్త కాదా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కు వ్యతిరేకంగా వర్మ చేత తీయించిన పీకే సినిమాకు డబ్బు రాలేదు కాబట్టే నూతన్ నాయుడు ద్వారా పరాన్నజీవి తీయించారని కొత్త కోణం తీశారు. మొత్తం మీద నూతన్ నాయుడును అడ్డంపెట్టుకుని పవన్ మీద బురద చల్లాలని చూసిన సాక్షికి సోషల్ మీడియాలో చీవాట్లు తప్పలేదు.