పవన్ కళ్యాణ్ అలా.. జనసేన పార్టీ ఇలా.!

జనసేన పార్టీని విడిగా, పవన్ కళ్యాణ్‌ని విడిగా చూడగలమా.? కానీ, చూడాల్సిందే. సినిమా పవన్ కళ్యాణ్ వేరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరు. సినిమాల్ని, రాజకీయాల్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వుండాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్‌ది. కానీ, పవన్ కళ్యాణ్ ఒకేసారి ఎడా పెడా చాలా సినిమాలకు కమిట్ అయిపోయిన దరిమిలా, రాజకీయాలకు ఆయన తగిన సమయం కేటాయించడం అంత తేలిక కాదు. పైగా, కరోనా పాండమిక్.. పవన్ కళ్యాణ్ సినిమా మరియు పొలిటికల్ ప్లాన్స్‌ని పూర్తిగా మార్చేసింది. 2024 ఎన్నికలకు కనీసం ఏడాది ముందు పూర్తిగా ఆయన సినిమాల్ని మానేయాల్సి వుంటుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా.? కాగా, పవన్ కళ్యాణ్ ఆమోదంతో.. అంటూ పార్టీ కార్యక్రమాల కమిటీని జనసేన అధికారికంగా ప్రకటించింది. నిజానికి, జనసేన పార్టీ సరైన అడుగు వేసింది ఈ విషయంలో.

పార్టీ తరఫున ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టాలన్నదానిపై ఓ కమిటీ వుండాలి. ఆ కమిటీ వుంటే, అది ఆయా అంశాల్ని మదింపు చేసి, అధినేత దృష్టికి ఓ నివేదికను తీసుకెళితే సరిపోతుంది.. అధినేత పెద్దగా ఆలోచించకుండానే ఆ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపొచ్చు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలు, జనసైనికులు తమ పని తాము చేసుకుపోతారు. నిజానికి, కరోనా నేపథ్యంలో అత్యంత సమర్థవంతంగా ప్రజలకు అండగా నిలబడింది జనసైనికులు మాత్రమే. కానీ, జనసైనికుల త్యాగాల్ని రాజకీయంగా క్యాష్ చేసుకోలేకపోయింది జనసేన పార్టీ. ఇక్కడ క్యాష్ చేసుకోవడమంటే, పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడం. ఇకపై అలాంటి సమస్య రాకుండా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.. పార్టీ కార్యక్రమాల కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా. అయినాగానీ, అటు సినిమాల్ని.. ఇటు రాజకీయాల్ని బ్యాలెన్స్ చేయడం అంత తేలిక కాదు. మరెలా.? ఏమో, ఈసారి పవన్ రాజకీయంగా మరిన్ని సవాళ్ళను ఎదుర్కోనున్నారు. ఆ సవాళ్ళను ఆయన సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే.. రాష్ట్ర రాజకీయాల్లో అదొక ఆశ్చర్యకరమైన పరిణామమే అవుతుంది.