దేశంలో జమిలి ఎన్నికలట.. కానీ, ఎప్పుడు.?

అదిగో జమిలి ఎన్నికలు.. ఇదిగో జమిలి ఎన్నికలంటూ గత కొంతకాలంగా నానా హంగామా జరుగుతోంది. 2023లోనే జమిలి ఎన్నికలు వుండొచ్చని.. 2017-18ల్లోనే బాగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, అత్యంత వ్యూహాత్మకంగా ఆలోచించి, ముందస్తు ఎన్నికలు వెళ్ళారంటారు. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమేనా.? అంటే, దానికి భిన్న వాదనలున్నాయి. దేశంలో జమిలి ఎన్నికలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకే దేశం.. ఒక ఎన్నికలన్నది జమిలి ఎన్నికల నినాదం. ఒకేసారి ఎన్నికలు జరుగుతాయ్ సరే.. రాష్ట్రాల్లో ఏదన్నా కారణంతో ఏదన్నా ప్రభుత్వం కూలిపోతే పరిస్థితి ఏంటి.? మిగిలిన కాలానికి మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా.? దేశంలో ఏదన్నా ప్రభుత్వం కూలిపోతే ఏమవుతుంది.? రాష్ట్రాల్లోనూ ముందస్తు ఎన్నికలు జరుపుతారా.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి.

జమిలి అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, జమిలి ఎన్నికలతో చాలా మేలు జరిగే అవకాశం వుంది. ప్రధానంగా ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. ఎప్పుడంటే అప్పుడు రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చే బాధ కూడా తప్పతుంది. జమిలి ఎన్నికల్ని పూర్తిగా తప్పు పట్టేయలేం.. అలాగని పూర్తిగా సమర్థించలేం. ప్రస్తుతం జమిలి ఎన్నికల గురించిన సమాలోచనలు జరుగుతున్నట్లు కేంద్రం, పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. లా కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా జమిలిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం వుందట. కానీ, అదెప్పుడు.? 2024 ఎన్నికల్లోపు జమిలి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే, ఇటీవలే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో జరగబోయే వివిధ రాష్ట్రాల ఎన్నికలతోనే జమిలి ఆలోచన తెరపైకి తెస్తే.. ఇప్పటికే నడుస్తున్న ప్రభుత్వాలు ఆ ఎన్నికల నాటికి కుప్ప కూలుతాయని భావించాలేమో.